
పశ్చిమబెంగాల్ సైబర్ నేరస్తుడు మదనపల్లెలో అరెస్టు
మదనపల్లె రూరల్ : ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పాటు సైబర్ నేరాలకు పాల్పడి మదనపల్లెలో తలదాచుకున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన సైబర్ నేరస్తుడిని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కలకత్తాకు చెందిన జిజాన్స్(40) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పలువురికి ఉద్యోగాలిప్పిస్తానని నగదు వసూలు చేసుకున్నాడు. అంతేకాకుండా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఆరు నెలల క్రితం కలకత్తా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న జిజాన్స్ మదనపల్లెకు వచ్చి స్థానికంగా మార్పూరి వీధిలోని టీ హోటల్‌లో పనిచేస్తూ తలదాచుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా కలకత్తా పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు మదనపల్లెలో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ముగ్గురు పశ్చిమబెంగాల్ పోలీసులు మదనపల్లెకు చేరుకుని, టూటౌన్ పోలీసుల సాయంతో జిజా న్స్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం నిందితుడిని కలకత్తాకు తరలించారు.