
నిధుల స్వాహా కథ.. కంచికేనా?
మదనపల్లె : కథలన్నీ కంచికి చేరుతాయన్న సామెతలాగా.. మదనపల్లె మున్సిపాలిటీలో లక్షల నిధుల స్వాహా కథ కూడా కంచికి చేరేలా కనిపిస్తోంది. మదనపల్లె స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో 2022–23 గుత్తలకు సంబంధించి రూ.29.50 లక్షల నిధులు స్వాహా విషయాన్ని ఈ నెల 14న ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్ ఒకటి నుంచి 2023 మార్చి 31 వరకు వారపుసంత, జంతువధశాల, దినసరి మార్కెట్‌ను వేలం ద్వారా రూ.94.55 లక్షలకు గుత్తకు అప్పగించారు. ఈ గుత్త పొందిన లీజుదారుడు చెల్లించిన నిధులు, స్వాహా అంశాన్ని అధికారులు ఇంకా కొలిక్కి తీసుకురాలేదని తెలుస్తోంది.
రెండు రోజులు విచారణ
పైసా సొమ్ము చెల్లించినా ఆన్‌లైన్ ద్వారా జమ చేసి చెల్లింపుదారునికి ఆన్‌లైన్ రశీదులు ఇస్తారు. అయితే ఈ గుత్తకు సంబంధించి రూ.29.50 లక్షల చెల్లింపు జరిగినట్టు, అందుకు చేతిరాత రశీదులు ఇచ్చిన ఉద్యోగి.. ఆపై సొమ్మును మున్సిపాలిటీకి జమ చేయలేదని గుర్తించారు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో అధికారులు రెండురోజుల పాటు విచారణ చేసి ముగించారు. విచారణలో సొమ్ము చెల్లింపుపై స్వాహా చేసిందెవరు, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే వివరాలను ఆరా తీయలేదని తెలుస్తోంది. మొత్తం ఆరోపణలకు కేంద్రమైన రశీదులు ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ చేస్తే.. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండేది.
అనుమానాలు ఎన్నో..
నిధుల స్వాహా రెండేళ్లుగా నలుగుతుండటంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుత్తల సొమ్ము చెల్లించాల్సిన లీజుదారు నిర్ణయించిన గడువులోగా సొమ్ము జమ చేయకుంటే మూడు నెలల ముందే.. లీజును రద్దు చేసే అవకాశం ఉన్నా, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. సొమ్ము జమ అయినట్టు చేతిరాత రశీదులు చూపించి లీజుదారు రద్దు నుంచి తప్పించుకున్నారా?.. ఇదే జరిగివుంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై అప్పుడే అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. అలా కాకుండా లీజు పూర్తయ్యాక సొమ్ము చెల్లింపు కోసం న్యాయపరమైన చర్యలు చేపట్టడం మున్సిపల్ నిబంధనల మేరకే జరిగిందా? రశీదులు ఇచ్చారంటే సంబంధిత ఉద్యోగి లీజుదారు నుంచి సొమ్ము తీసుకున్నట్టు ఎవరైనా భావిస్తారు. ప్రధానంగా డబ్బు తీసుకున్నట్టు రశీదులు ఇవ్వడం ఈ వ్యవహారంలో కీలకమైంది. కాబట్టి అధికారులు తగిన రీతిలో లీజుదారు, సంబంధిత ఉద్యోగిని విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంత పెద్ద మొత్తానికి చేతిరాత రశీదులపై తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని మున్సిపల్ సిబ్బంది చర్చించుకొంటున్నారు.
ముగింపు ఎలా..!
గుత్తల సొమ్ము స్వాహా వ్యవహారానికి ఎలా ముగింపు పలకాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. న్యాయపరమైన చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నా.. స్వాహా విషయాన్ని ‘సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో అధికారుల్లో కదలిక వచ్చి, రెండు రోజులు ఉద్యోగులతో రహస్య విచారణ జరిపారు. ఆ విచారణలో ఏమి తేల్చారో బయటకు పొక్కలేదు కానీ.. ఈ స్వాహా కథకు ముగింపు పలకడం కోసం దారులు వెతుకుతున్నట్టు తెలుస్తోంది.
‘సాక్షి’ కథనంతో రహస్య విచారణ
రూ.29.50 లక్షలకు చేతి రశీదులపై జరగని విచారణ
లీజుదారు డబ్బు చెల్లించకున్నా
కొనసాగించిన వైనం
ఈ వ్యవహారంపై ముగింపు పలకలేక మల్లగుల్లాలు?