
ఆగిన వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు
రాయచోటి టౌన్ : రాయచోటికే తలమానికంగా నిలిచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి కోసం రూ. కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. ప్రధానంగా వీరభద్రస్వామి ఆలయానికి చెందిన పనుల్లో స్వామి వారి ఆలయానికి పడమర దిక్కున ప్రహరీకి ఆనుకొని ఉన్న ఆక్రమణల తొలగింపు అంశాన్ని అప్పటి ఎమ్మెల్యే, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ఎంతో చాకచక్యంగా పరిష్కరించారు. అంతేకాకుండా వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటి స్థలాలు కూడా కేటాయించి ఇళ్ల నిర్మాణాలకు సహకరించారు. ఆ వెంటనే పశ్చిమ రాజగోపురం రూ.158 కోట్లతో నిర్మించారు. అలాగే గర్భాలయంపై పిడుగు పడటంతో 2020లోనే మళ్లీ రూ.33 లక్షలతో పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనంతరం రూ.38 లక్షలతో మాఢవీధులు నిర్మించారు. చివరగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఐదు అంతస్తుల భవనాలు నిర్మించేందుకు రూ.1.58 కోట్లతో 2023 జనవరి 26న పనులు ప్రారంభించారు. మూడు అంతస్తుల వరకు గోడలు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పనులు ఆగిపోయిన విషయమై ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డిని వివరణ కోరగా నూతన కమిటీ ఏర్పడ్డాక మిగిలిన పనులు పూర్తి చేయిస్తామన్నారు.
యువకులపై పోలీసుల దాడి దారుణం
పోరుమామిళ్ల : తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషమని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగరీత్యా నేరమని మానవహక్కుల సంఘం జిల్లా చీఫ్ గంగన్న, ప్రతినిధులు ఫణిరావు, శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌లో దండించడం పక్కనపెట్టి బహిరంగంగా నడిరోడ్డుపై ముగ్గురు యువకులను కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో మోదడం చూస్తున్నవారిని భయకంపితులను చేసిందన్నారు. అమానుషంగా ప్రవర్తించిన ఇద్దరు సీఐలపై చర్య తీసుకోవాలని కోరారు. రౌడీలను దారిలో పెట్టే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు.

ఆగిన వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు