
చెక్‌బౌన్స్ కేసులో రూ.15 లక్షలు జరిమానా
తంబళ్లపల్లె : చెక్ బౌన్స్ కేసులో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి రూ.15లక్షలు జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఉమర్‌ఫారూఖ్ తీర్పు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన లోకనాథరెడ్డి 2018లో తంబళ్లపల్లె వాసి రామమూర్తికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. బాఽధితుడు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. బాధితుడి తరపున న్యాయవాది గఫార్ కేసు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయి నేరం రుజువుకావడంతో లోకనాథరెడ్డికి రూ.15 లక్షలు జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ప్రభుత్వ భూమి కబ్జా.!
పుల్లంపేట : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ భూములను కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. మండల వ్యాప్తంగా 400 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. యథేచ్ఛగా భూముల్లో చెట్లు నాటుకొని పంటలు సాగు చేస్తున్నారు. పూర్వకాలం నుంచి గ్రామంలో చనిపోయిన వారి భార్యలు గాజు, పూస తీసే భూమిని చిన్న ఓరంపాడు వీఆర్‌ఓ రాంబాబు, వీఆర్‌ఏ రామచంద్రలు ఆక్రమించుకుంటున్నారని మంగళవారం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎల్లయ్య దీనిపై మాట్లాడుతూ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. మొక్కుబడిగా ఆర్‌ఐ విచారణ చేపట్టి వీఆర్‌ఓ, వీఆర్‌ఏకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తమ ఆక్రమణను అడ్డుకుంటే మీ అంతు చూస్తామని కూటమి నాయకులు బెదిరిస్తున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ విషయంపై పుల్లంపేట తహసీల్దార్ అరవింద కిషోర్‌ను వివరణగా కోరగా ఆక్రమణదారులపై తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫ్లెక్సీ పడి టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడికి తీవ్ర గాయాలు
కడప అర్బన్ : మహానాడు ప్రాంగణం సమీపంలో జరిగిన ప్రమాదంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు గాయపడ్డాడు. మోటారు సైకిల్‌పై వెళ్తున్న పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లెకు చెందిన చెండ్రాయుడు (52)పై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫ్లెక్సీ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
డీఈఓ వెబ్‌సైట్‌లో
సీనియారిటీ జాబితా
కడప ఎడ్యుకేషన్ : మున్సిపల్ మేనేజ్‌మెంట్ ప్రొద్దుటూరులో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 01:03 నిష్పత్తిలో ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా జిల్లా విద్యాశాఖాధికారి వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఉపాధ్యాయులు సంబంధిత ధ్రువపత్రాలతో కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో ఈనెల 28వ తేదీ హాజరు కావాలని కోరారు.