
లాంజ్ బాత్‌రూమ్‌లో యువకుడి మృతి
నెల్లూరు(క్రైమ్) : నెల్లూరు ఆర్టీసీ ప్రాంగణంలోని ఎంఎస్‌ఆర్ డీలక్స్ లాంజ్ బాత్ రూమ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం కారనిమిట్టకు చెందిన ఎస్.విజయకుమార్ (26) మదనపల్లెలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితం సమీప బంధువైన ఉషతో వివాహమైంది. సోమవారం విజయకుమార్ మదనపల్లెలోని వైద్యశాలకు వెళ్లాడు. డాక్టర్ సూచనల మేరకు మందులు తీసుకెళ్లేందుకు నెల్లూరుకు వచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్‌లోని రిజర్వేషన్ కౌంటర్ పక్కనే ఉన్న ఎంఎస్‌ఆర్ డీలక్స్ లాంజ్‌లో బాత్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాంజ్ నిర్వాహకులు చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మంగళవారం నెల్లూరుకు చేరుకున్న బాధిత కుటుంబం విజయకుమార్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. మృతుని తమ్ముడు చందు ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఎస్‌ఐ వీసీ సుబ్రమణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీరపునాయునిపల్లెలో
దారుణ హత్య
వీరపునాయునిపల్లె : మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో మంగళవారం దారుణ హత్య జరిగింది. వీరపునాయునిపల్లెకు చెందిన అనిమెల ఆంజనేయులు అలియాస్ సుమో ఆంజనేయులు (45) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బైకుపై ఇంటికి వెళుతుండగా కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి గొంతు కోసి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. తమ ఇంటి వద్ద నివాసముంటున్న బెలుకూరి నరేష్, నవీన్‌లతో తమకు చాలా కాలంగా సమస్యలున్నాయని వారే ఈ హత్య చేసి ఉండవచ్చని మృతుడు ఆంజనేయులు భార్య కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మంజునాథ్ తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చల్లని దొర ఆదేశాల మేరకు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఈతకు వెళ్లి
ఇంటర్ విద్యార్థి మృతి
తొండూరు : తొండూరు మండలం ఊడవగండ్ల గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి దాసరి దేవా సాయి యల్లారెడ్డి(17) మంగళవారం ఈతకోసం వెళ్లి బావిలో మునిగి మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాసరి దేవా సాయి యల్లారెడ్డి బంధువులతో కలిసి గ్రామంలోని బావి వద్దకు ఈతకు వెళ్లాడు. అందరూ సరదాగా ఈత కొడుతున్న క్రమంలో దేవసాయి ప్రమాదవశాత్తు బావిలోని మెటికల కింద ఉండిపోవడంతో శ్వాస ఆడక మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు.
ఆత్మహత్యకు యత్నించిన యువకుడి మృతి
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో భగత్ సింగ్ నగర్‌లో నివాసముంటున్న వారం రామాంజులు (21) అనే యువకుడు ఈనెల 21వ తేదీన విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామాంజులు చింతకొమ్మదిన్నెకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులు ఆ యువతి వరుస కాదని వివాహం చేసేందుకు అంగీకరించలేదు. దీంతో ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 26వ తేదీన మృతి చెందాడు.

లాంజ్ బాత్‌రూమ్‌లో యువకుడి మృతి