
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
రాయచోటి : రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో రాజంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ ఈఆర్ చంద్ర (43) గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం ఉదయం రాజంపేట నుంచి బయలు దేరిన ఆర్టీసీ బస్సు 7.45 గంటలకు రాయచోటి బస్టాండ్‌కు చేరుకుంది. బస్సును బస్టాండ్ పాయింట్‌లో పెట్టి కండక్టర్ శ్రీధర్‌తో కలిసి టిఫిన్ తిన్న అనంతరం నీరు పట్టుకోవడానికి సెకండ్ ఫ్లోర్‌లోకి వెళ్లిన డ్రైవర్ అక్కడే గుండెపోటుతో మృతి చెందినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు హటాహుటిన సీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సంఘటనపై పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రాయచోటి డిపో మేనేజర్ ధనుంజయ, ఎంప్లాయిస్ యూనియన్ లీడర్లు జిఎం రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.