మదనపల్లె : కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని కురవంకకు చెందిన వీరబ్రహ్మేశ్వరరావు కుమారుడు వి.వి.ఎన్.రాఘవేంద్ర వ్యాసకుమార్(44) ఈనెల 1న వ్యక్తిగత పనులపై చిత్తూరు వెళ్లాడు. అక్కడే అతడి భార్య నర్సుగా పనిచేస్తోంది. అదేరోజు కుటుంబ సమస్యలతో చిత్తూరులో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్యకు ఫోన్‌చేశాడు. ఆమె స్థానికుల సహాయంతో బాధితుడిని వేలూరు సీఎంసీ వైద్యశాలకు తీసుకెళ్లగా, అక్కడ అడ్మిషన్ చేసుకోకపోవడంతో మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం వి.వి.ఎన్.రాఘవేంద్ర వ్యాసకుమార్ మృతి చెందాడు. అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బంది చిత్తూరు పోలీసులకు సమాచారం అందించారు.
డీఎస్పీని రక్షణ కోరిన ప్రేమ జంట
మదనపల్లె : కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమ జంట మంగళవారం డీఎస్పీ మహేంద్రను ఆశ్రయించి, రక్షణ కోరుతూ వినతి చేశారు. తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి పంచాయతీ దండువారిపల్లెకు చెందిన వెంకటరమణ రెడ్డమ్మ దంపతుల కుమారుడు సుదర్శన్ (30)కు చిత్తూరు జిల్లా సోమల మండలం గట్టువారిపల్లె పంచాయతీ గురికానివారిపల్లెకు చెందిన మహేశ్వర, పుష్పవతి దంపతుల కుమార్తె చైత్ర (19)తో 2024 డిసెంబర్ లో పెళ్లిచూపులు జరిగాయి. మొదట రెండు కుటుంబాలు అంగీకరించినా, చైత్ర మేనమామ సూచనతో పెళ్లి సంబంధాన్ని నిరాకరించారు.
అయితే అప్పటికే ఒకరినొకరు ఇష్టపడ్డ సుదర్శన్, చైత్ర నాలుగు నెలల పాటు వేచి చూశారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో, సోమవారం ఇంట్లో నుంచి పారిపోయి పుంగనూరు వద్ద శివాలయంలో వివాహం చేసుకున్నారు. చైత్ర తన కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించి మంగళవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయం చేరుకుని, తాము ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని వినతి చేశారు.

డీఎస్పీని రక్షణ కోరిన ప్రేమ జంట