అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు పోశారు | - | Sakshi
Sakshi News home page

అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు పోశారు

Apr 17 2025 12:30 AM | Updated on Apr 17 2025 12:30 AM

అరుదై

అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు పోశారు

రాయచోటి టౌన్‌ : ఒకప్పుడు రాయచోటిలో చిన్న పాటి చికిత్స చేయాలన్నా సరైన వైద్య నిపుణులు లేక తిరుపతి, కడప లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే రాయచోటిలో కూడా కార్పొరేట్‌ స్థాయిలో శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రాయచోటి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని 100 గదుల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కార్పొరేట్‌ స్థాయిలో దాదాపుగా రూ.25కోట్లు ఖర్చు చేసి పెద్ద భవనాలు నిర్మించారు. అందుకు తగ్గట్టుగానే వైద్యులను నియమించడంతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో..

గాలివీడు మండలానికి చెందిన శృతి అనే పేద మహిళ మొదటి కాన్పు సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి శస్త్ర చికిత్స ద్వారా మొదటి కాన్పు జరుపుకొంది. ఆ సమయంలో ఆ సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ మలం, మూత్రం రెండు ఒకే దారిలో రావడం మొదలయ్యాయి. దీనిని రెక్టో వేజైనల్‌ ఫిస్టులా అంటారు. అసలే పేద కుటుంబం కావడంతో కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకోలేక తీవ్ర మనోవేదనను అనుభవించింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం రెండవ కాన్పు కోసం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తన తల్లితో కలసి వచ్చింది. ఈ విషయం ఆస్పత్రి వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. సాధారణ కాన్పు చేసిన వైద్యులు తరువాత ఆమెకు ఉన్న పెద్ద సమస్యను కూడా గుర్తించారు. గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ జీనత్‌ బేగం, శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, అనస్థీషియా డాక్టర్‌, ఇతర వైద్యులు కలిసి చర్చించారు. ఆమెకు ఉన్న సమస్యను పరిష్కరించాలంటే ఆపరేషన్‌ ఒక్కటే మార్గమని తీర్మానించారు. అందుకు ఆమె అంగీకారం తీసుకుని వెంటనే ఆమెకు డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, డాక్టర్‌ జీనత్‌ బేగం, డాక్టర్‌ బండారు కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ శివ, డాక్టర్‌ అజాజ్‌ అహమ్మద్‌తో కలసి ఆపరేషన్‌ చేశారు.

శ్రీ వెంకటేశ్వర ఆస్పత్రిలో...

రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలో ఒకే రోజు రెండు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి ప్రాణదానం చేశారు. గాలివీడుకు చెందిన బాలుడు నీటి కుంటలో పడిన సమయంలో ఊపిరి ఆడక పోవడంతో పాటు అదే సమయానికి గుండెకు ఆక్సిజన్‌ అందకపోవడంతో గుండె పోటు వచ్చింది. స్థానికులు గమనించి రాయచోటికి తరలించారు. శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర రెడ్డి స్పందించి ఆపరేషన్‌ చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు. అలాగే మంగళవారం రాత్రి ఒక మధ్య వయస్సు వ్యక్తి కంటి కింద దవడ భాగం తీవ్రంగా బాధిస్తోందని చెప్పడంతో స్కానింగ్‌ చేసి బ్లాక్‌ ఫాక్స్‌ ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే హైదరాబాద్‌కు చెందిన స్పెషలిస్ట్‌ డాక్టర్ల సలహా మేరకు వారి పర్యవేక్షణలో ఆపరేషన్‌ చేసి దవడ ఎముక తొలగించి దాని స్థానంలో మరొకటి అమర్చారు.

అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు పోశారు 1
1/1

అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు పోశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement