ఒంటిమిట్టలో మహిళ దారుణ హత్య
ఒంటిమిట్ట : మండల పరిధిలోని గుంటికాడిపల్లి గ్రామంలో ఆదివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు..రాజంపేటకు చెందిన యానాది వెంకటరమణ, ఆతని భార్య నాలుగు రోజుల క్రితం గుంటికాడిపల్లి గ్రామంలోని వెంకట సుబ్బారెడ్డి మామిడి తోటలో కాపలా ఉంటామని వచ్చి, అక్కడి గుడిసెలో నివాసం ఉన్నారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు మామిడి తోట యజమానులు వారి కోసం వెళ్లి చూడగా అక్కడ యానాది వెంకట రమణ భార్య వివస్త్ర అయి, ఒంటి మీద కమిలి పోయిన గాయాలతో చనిపోయి ఉంది. ఆమె భర్త వెంకటరమణ పరారీ అయ్యాడు. దీంతో కంగారు పడిన మామిడి తోట యజమానులు ఒంటిమిట్ట పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ నరసింహారాజు, ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఎస్‌ఐ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించారు. మృతురాలి పేరు, వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. వీఆర్‌ఓ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు తెలిపారు.


