హృదయ నివేదనే క్రిస్మస్‌ | - | Sakshi
Sakshi News home page

హృదయ నివేదనే క్రిస్మస్‌

Dec 22 2025 2:05 AM | Updated on Dec 22 2025 2:05 AM

హృదయ

హృదయ నివేదనే క్రిస్మస్‌

రాజంపేట టౌన్‌ : ప్రపంచ వ్యాప్తంగా జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్‌. క్రీస్తు జననానికి చిహ్నంగా జరుపుకునే క్రిస్మస్‌ వేడుకలకు జిల్లాలోని క్రైస్తవులు, విశ్వాసులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సెమీ క్రిస్మస్‌, క్రిస్మస్‌ ఆరాధన పాటలతో క్రైస్తవులు, విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కాగా క్రిస్మస్‌ను స్వాగతిస్తూ బుధవారం రాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. క్రిస్మస్‌ పండుగ సమీపించడంతో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అంతటా పండుగ కోలాహలం నెలకొంది.

శాంతికి, త్యాగానికి ప్రతీక క్రిస్మస్‌..

శాంతికి, త్యాగానికి ప్రతీక క్రిస్మస్‌. క్రీస్తు జననం లోకానికి పర్వదినమని ప్రపంచమంతా అభివర్ణిస్తుంది. విశ్వాసం, ప్రేమ, కరుణ, దయ, నిరీక్షణ సందేశంతో క్రీస్తు లోకానికి కొత్త మార్గాన్ని చూపారు. మనిషి తన హృదయాన్ని క్రీస్తుకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్‌ అని క్రైస్తవులు, విశ్వాసుల ప్రగాఢ విశ్వాసం. క్రైస్తవ లోకం అన్ని వర్గాల ప్రజలతో కలిసి సంతోషంగా ఆచరించే పర్వదినమే క్రిస్మస్‌. క్రిస్మస్‌ అంటే క్రీస్తు జన్మదినం. క్రైస్ట్‌ అంటే అభిషిక్తుడు మస్‌ అంటే ఆరాధన అని అర్థం. ఈ పదానికి అర్థం క్రీస్తును ఆరాధించడం.

యెహోవాను భూమికి కానుకగా

ఇచ్చిన దినమే క్రిస్మస్‌..

సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తన ప్రియ కుమారుని నరరూపిగా ఈ భువికి కానుకగా ఇచ్చిన పవిత్ర దినమే క్రిస్మస్‌. పాత నిబంధన కాలంలోని యెషయా, దానియేలు, మీకా, మలాకీ తదితర ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పే క్రిస్మస్‌. ఈయన పరిశుద్ధాత్మ వల్ల పవిత్రుడిగా కన్య గర్భాన జన్మించాలన్నది యెహోవా దేవుని నిర్ణయం. ఈ సంకల్పమే దూత గాబ్రియేలు ద్వారా మరియాకు అందించిన శుభ వర్తమానం. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు తనను తాను తగ్గించుకొని బెత్లెహాం అనే గ్రామంలో పశువుల పాకలో జన్మించారు. క్రీస్తు జన్మించగానే ఆకాశంలో ఆయన నక్షత్రం వెలిసింది. ఈ నక్షత్ర జాడతో తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు జననాన్ని గుర్తించారు. దైవ దూత ద్వారా అమాయకులైన గొల్లలకు ఈ వర్తమానం అందింది. ఆ సమయంలో పరలోక సైన్య సమూహం స్తుతి గానాలు చేసింది. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నదే క్రీస్తు బోధన సారాంశం. దాని ప్రకారం క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులు నూతన దుస్తులు, కానుకలు, ఆహార పదార్థాలు ఇచ్చి దీనులను ఆదరిస్తారు. చర్చిల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.

బహుమతులు ఇచ్చే క్రిస్మస్‌ తాత..

సెయింట్‌ నికోలస్‌ అనే గ్రీకు బిషప్‌ స్ఫూర్తితో శాంటాక్లాజ్‌ అనే ఒక పాత్ర రూపుదిద్దుకుంది. 1823వ సంవత్సరంలో అమెరికా, కెనడా, బ్రిటన్‌ దేశాల్లో శాంటాక్లాజ్‌ వర్ణనపై రచించిన ఏవిజిట్‌ ఫర్‌ సెయింట్‌ నికోలస్‌ అనే కవిత ఆధారంగా థామస్‌నెస్ట్‌ అనే చిత్రకారుడు శాంటాక్లాజ్‌ ఊహాచిత్రాన్ని గీశారు. దీని ఆధారంగా క్రిస్మస్‌ తాత పాత్ర రూపుదిద్దుకుంది. క్రిస్మస్‌ రోజున రథంపై క్రిస్మస్‌ తాత వస్తాడని, మంచి ప్రవర్తన గల పిల్లలకు బహుమతులు తెస్తాడని, చెడు ప్రవర్తనగల పిల్లలకు బొగ్గు ఇస్తాడని చెబుతుంటారు.

క్రిస్మస్‌ ట్రీకి ఎంతో ప్రాధాన్యత..

క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా చర్చిల్లో, క్రైస్తవులు, విశ్వాసులు తమ ఇళ్లల్లో క్రిస్మస్‌ ట్రీని అలంకరించుకుంటారు. ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో క్రిస్మస్‌ ట్రీకి సంబంధించి పలు రకాల చరిత్ర ఉంది. ఆధునిక జర్మనీ ఏర్పడిన తరువాత క్రిస్మస్‌ ట్రీ ప్రాచుర్యంలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో మార్టిన్‌ లూథరన్‌ మొదటి సారిగా ఎవర్‌గ్రీన్‌ అనే చెట్టును కొవ్వొత్తులతో అలంకరించినట్లు చెబుతారు. 20వ శతాబ్దంలో క్రిస్మస్‌ ట్రీ చర్చిలకు విస్తరించింది. కాలక్రమేణా ఈ సాంప్రదాయం అన్ని దేశాలకు విస్తరించింది. క్రిస్మస్‌ ట్రీ నిత్య జీవనానికి సూచికగా, అపవాదును పారదోలే సాధనంగా క్రైస్తవులు, విశ్వాసులు భావిస్తారు.

క్రీస్తు జననానికి చిహ్నంగా

కొనసాగుతున్న ప్రత్యేక ప్రార్థనలు

జిల్లాలో క్రిస్మస్‌ పండుగకు

ముస్తాబవుతున్న చర్చిలు

ఎల్లుండి రాత్రి నుంచి ప్రారంభం కానున్న క్రిస్మస్‌ వేడుకలు

పూర్ణ హృదయంతో ఆరాధించాలి

క్రీస్తు పుట్టుకలో దేవదూతలు, జ్ఞానులు, గొర్రెల కాపరులు ఆయనను ఆరాధించారు. జ్ఞానులైన వారు తాము తీసుకొచ్చిన బంగారం, బోళము, బహుమానాలను బాలుడైన క్రీస్తుకు సమర్పించారు. పరలోకం విడిచి భూలోకమునకు వచ్చిన క్రీస్తును పూర్ణ హృదయంతో ఆరాధించాలి. మన హృదయాలను క్రీస్తుకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్‌.

– మార్టిన్‌ లూథరన్‌, పాస్టర్‌, బేతేలు చర్చి, రాజంపేట

ప్రేమ, త్యాగం, దయాగుణాలే క్రిస్మస్‌

క్రిస్మస్‌ మానవాళికి శుభదినం. క్రీస్తు ప్రబోధించిన సుగుణాలు, పరిశుద్ధత, తగ్గింపు స్వభావం, ప్రేమ, త్యాగం, దయాగుణాలను అలవరుచుకోవడమే క్రిస్మస్‌ సందేశం. అందువల్లే ప్రపంచమంతా ఆ శుభ ఘడియ కోసం ఎదురు చూస్తోంది.

– కస్తూరి ఫోనిక, సిస్టర్‌, నిజస్వరూపిణి మందిరం, రాజంపేట

హృదయ నివేదనే క్రిస్మస్‌1
1/3

హృదయ నివేదనే క్రిస్మస్‌

హృదయ నివేదనే క్రిస్మస్‌2
2/3

హృదయ నివేదనే క్రిస్మస్‌

హృదయ నివేదనే క్రిస్మస్‌3
3/3

హృదయ నివేదనే క్రిస్మస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement