అన్నను హతమార్చిన తమ్ముడు
గుర్రంకొండ : కుటుంబ కలహాలతో సొంత అన్ననే తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన మండలంలోని కండ్రిగ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్ నజీబ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో నజీబ్ రాయచోటిలో ఒంటరిగా ఉంటున్నారు. కండ్రిగలోని తన సొంత ఇంట్లో కుమారులు షేక్ సాదిక్ (27) షేక్ మహమ్మద్ రఫీక్ (19) కలిసి ఉంటున్నారు. సాదిక్‌కు పదేళ్ల క్రితం కురబలకోట మండలం ముదివేడుకు చెందిన షమీమ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా సాదిక్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి భార్యను హింసించేవాడు. భర్త వేధింపులు భరించలేక భార్య షమీమ్ నాలుగేళ్ల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇంట్లో అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు. ఇంట్లో ఎవరు ఉండాలనే విషయమై అన్నదమ్ములు గత కొన్ని రోజులుగా ఘర్షణ పడుతుండేవారు. మూడురోజుల క్రితం ఘర్షణ పెద్దది కావడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సాదిక్ పూటుగా మద్యం తాగి మరోసారి ఇంటి విషయమై తమ్ముడితో ఘర్షణకు దిగాడు. వివాదం పెద్దదిగా మారి బాహాబాహి తలపడ్డారు. ఇంట్లో ఉన్న కత్తితో మహమ్మద్‌రఫీక్ అన్న సాదిక్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో సాదిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తమ్ముడు రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కలవారు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ బాలకృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక వీఆర్వో ప్రతిమ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


