వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
టీడీపీ అధ్యక్షుడిగా భూపేష్
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతే స్పీడ్‌గా తిరోగమనం చవిచూడాల్సి వస్తుంది. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డే తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాసు వ్యవహారశైలితో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం తాజాగా జిల్లా బాధ్యతల నుంచి తప్పించింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి కింగ్ పిన్... పార్టీ యావత్తు తన చుట్టే తిరిగేది. నియోజకవర్గాల్లో తాను సూచించిందే ఫైనల్. ఇది పదేళ్ల క్రితం మాట. క్రమేపీ తప్పించుకునే ధోరణి అలవాటు చేసుకున్నారు. ఉన్న కేడర్‌లో నమ్మకం సన్నగిల్లింది. కడప పార్లమెంటు పరిధిలో కీలక నేతగా ఉన్న ఆయన, కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. పోనీ కడప నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్‌కు భరోసాగా నిలిచారా?అంటే అదీ లేదు. అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం అంటిపెట్టుకొని వస్తున్నవారిని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. చివరికి కార్పొరేషన్ పాలకమండలిలో టీడీపీ పరువు నిలిపిన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబానికి రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నికలకు ముందు సర్వస్వం టీడీపీనే అనుకున్న వారిని క్రమేపి దూరం చేసుకుంటూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఒంటెత్తు పోకడలు...దౌర్జన్యకర ఘటనలు
టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో తాను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్నట్లు వాసు వ్యవహరించారు. కడప గడపలో వైరిపక్షానికి చెందిన రెండు బార్లు బలవంతంగా లాక్కున్న ఘటన తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో తలమునకలైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని సదరు మద్యం వ్యాపారి వాపోవడం గమనార్హం. టీడీపీ కేడర్‌పై అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనే ఇలాంటి దౌర్జన్యకర ఘటనలను ప్రోత్సహించేలా చేసిందని విశ్లేషకుల మాట. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన టీడీపీ కేడర్ పొరుగు నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వద్దకు క్యూ కట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు పాటించడం, కమలాపురానికెళ్లి మరీ పుత్తాకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలను సరిదిద్దుకోవాలనే ఆలోచన లేకపోవడంతో అధిష్టానం వద్ద మరింత చులకన కావాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కడపలో నిర్దిష్ట అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారు. ఎంతసేపు వైరిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇలాంటి ఘటన లన్నీ కూడా అధ్యక్ష పదవి తొలగింపునకు ప్రధాన కారణమయ్యాయని పరిశీలకులు వివరిస్తున్నారు.
టీడీపీని ఏకతాటిపై నడపడంలో విఫలం
కడప టీడీపీ కేడర్‌లో పెరిగిన అసంతృప్తి
పుత్తాను ఆశ్రయిస్తూ వచ్చిన తెలుగుతమ్ముళ్లు
రాజ్యసభ సీటుపై సన్నగిల్లిన ఆశలు
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల సుబ్బరామిరెడ్డి (భూపేష్‌రెడ్డి)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ప్రధాన కార్యదర్శిగా జబీబుల్లా (ప్రొద్దుటూరు)ను నియమించారు. కాగా భూపేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకుంటే చిన్నాన్న ఆదినారాయణరెడ్డి పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలకు, అంతర్గత విభేదాలకు తావు లేకుండా ఉండేందుకే తాజాగా జిల్లా అధ్యక్ష పదవి అప్పగించి ఉంటుందని రాజకీయ వేత్తలమాట. పైగా అధిష్టానం రిమోట్ కంట్రోల్ ద్వారా పార్టీని చక్కదిద్దేందుకు కట్టబెట్టారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!


