క్రీడలతో మానసికోల్లాసం
రాయచోటి: క్రీడలతో మానసికోల్లాసం పొందొచ్చని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా వార్షిక పోలీసు స్పోర్ట్స్– గేమ్స్ మీట్–2025 ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. 24 గంటల విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులకు క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయన్నారు. క్రీడలు గెలుపుకోసమే కాదని, కష్టాన్ని, ఓటమిని ధైర్యంగా భరించే శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్రస్థాయి పోలీసు మీట్‌లో డెకత్లాన్ విభాగంలో వరుసగా మూడేళ్లు గోల్డ్ మెడల్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ ఎం చెన్నయ్య నుంచి ఎస్పీ క్రీడా జ్యోతిని స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి మాట్లాడారు. అనంతరం పరుగుపందెం ఫైనల్ పోటీ విజేతలకు ఎస్పీ చేతులు మీదుగా మెడల్స్‌ను బహుకరించారు. మూడురోజులపాటు జరిగే ఈ పోటీల్లో జిల్లాలోని నాలుగు పోలీసు జోన్లు పాల్గొంటున్నాయి.అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, టెన్నీష్, షటిల్ బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్ క్రీడలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, మదనపల్లె డీఎస్పీ ఎస్ మహేంద్ర పాల్గొన్నారు.


