ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
ప్రొద్దుటూరు క్రైం : ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్‌ల ద్వారా బెట్టింగ్ కొనసాగిస్తున్న ముఠా కార్యకలాపాల గుట్టు రట్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో 25 మందిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3.10 లక్షలు నగదు, 23 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన బుధవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయిన నాటి నుంచి ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి క్రికెట్ బెట్టింగ్‌పై నిఘా ఉంచారు. ఇందులో భాగంగానే బుకీలకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండోవర్ చేశారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరలోని రామేశ్వరం నీళ్లట్యాంకు వద్ద క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో 18 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 2.05 లక్షలు నగదు, 18 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన దొరసానిపల్లెకు చెందిన పుత్తాగిరీష్ అనే వ్యక్తి గతంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో బిగ్‌బబూల్ 247.కామ్ అనే వెబ్‌సైట్‌లో కొంత మంది యువకులను యాప్‌లో చేర్చుకొని పందేలు నిర్వహించేవాడు. ఇలా సుమారు 40 మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఖాతాలను పరిశీలించగా సుమారు రూ. 1 కోటి పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలించి ఫ్రీజ్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో పుత్తా గిరీష్‌కుమార్‌తో పాటు సాధు వీరప్రసాద్, పాతకోట ప్రతాప్‌రెడ్డి, ఆవుల సుబ్బారెడ్డి, బీచెర్ల సుబ్బారెడ్డి, వరదా సుధాకర్, మార్తల గురుశేఖర్‌రెడ్డి, మైలాగిని శివచైతన్య, సాధు పన్‌కుమార్, నల్లమారు నాగేంద్ర, వరదా ఆంజనేయులు, చిన్నకొండగిరి సుబ్బయ్య, మేకల మదనబాబు, ఎర్రమాసు ప్రతాప్, పబ్బతి శివశంకర్, తాటికొండ శ్రీను, తాటికొండ జగన్, భరతికవి చిన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె, చౌటపల్లె తదితర ప్రాంతాలకు చెందిన వారు. ఇదే కేసులో 23 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.
మరో కేసులో ఐదుగురు అరెస్ట్
పట్టణంలోని ఇస్లాంపురం వీధిలో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కోనేటికాల్వవీధికి చెందిన షేక్ మాబుషరీఫ్ అలియాస్ చుంచు, పిందాల జనార్దన్‌రెడ్డి, భూమిరెడ్డి నాగార్జునరెడ్డి, వేంపల్లి సుదర్శన్‌రెడ్డి, శ్రీరామ్ సుబ్బరాయుడు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 1.05 లక్షలు నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లోని 23 మంది నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
బెట్టింగ్ వ్యవహారంలో బడా బుకీల ప్రమేయం
బెట్టింగ్ వ్యవహారంలో ప్రొద్దుటూరులోని బడా బుకీలైన టీడీపీ నాయకులకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పలువురు టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. దొరసానిపల్లె సర్పంచ్ అరవ ఈశ్వరమ్మ భర్త అరవ మునివర, షేక్ ఫారూక్, షేక్ గౌస్‌బాషా అలియాస్ బెంగళూరు బాషా, ప్రొద్దుటూరు మున్సిపాలిటి 25వ వార్డు కౌన్సిలర్ షేక్ హెహనూర్ భర్త ఖాదర్‌బాషాతో పాటు ఏలే నరసింహలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇస్లాంపురం వీఽధిలో పట్టుబడిన ఐదుగురు బుకీలు వీరి కనుసన్నల్లో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరిపై ప్రొద్దుటూరుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ క్రికెట్ పందేల కేసులు ఉన్నాయి. ప్రొద్దుటూరులో ప్రప్రథమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై బీఎన్‌ఎస్ 111 (2), 112 (2) అనే కొత్త సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో బీఎన్‌ఎస్ 111 (2) సెక్షన్ అనేది తీవ్రమైందని తెలిపారు. ఈ రెండు కూడా నాన్‌బెయిలబుల్ సెక్షన్‌లని, వ్యవస్థీకృత నేరం కింద 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు
బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా వదలే ప్రసక్తి లేదని డీఎస్పీ తెలిపారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు నమోదు అయితే బెయిల్ కూడా రాదన్నారు. చాలా మంది యువకులు కూడా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. యువత బెట్టింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోరాదన్నారు. ప్రతి యాప్, వెబ్‌సైట్ పైనా పోలీసుల నిఘా ఉందన్నారు. ఐడీలు, ఐపీ అడ్రస్ ఆధారంగా యాప్‌లు ఎక్కడ క్రియేట్ చేశారో తెలుసుకొని సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో శ్రమించిన సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు, సిబ్బంది రఘు, రామ్మోహన్‌లను డీఎస్పీ భావన అభినందించారు. రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో సీఐలు సదాశివయ్య, గోవిందరెడ్డి, బాలమద్దిలేటి పాల్గొన్నారు.
బెట్టింగ్ నిర్వహిస్తున్న 23 మంది అరెస్టు
రూ.3.10 లక్షలు నగదు, 23 సెల్‌ఫోన్లు స్వాధీనం
ఆన్‌లైన్‌లో రూ. 1 కోటికి పైగా జరిగిన లావాదేవీలు
బెట్టింగ్ కేసులో పలువురు టీడీపీ నాయకులు


