ముస్లిమేతరులను వక్ఫ్ కమిటీల్లో ఎలా నియమిస్తారు?
మదనపల్లె : ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డు కమిటీల్లో ఎలా నియమిస్తారు? ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలిగించే వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వెనక్కుతీసుకోండి అంటూ విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే పార్టీ) ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇండియా కూటమి పార్టీల నేతలు డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, వీసీకే పార్టీ అధినేత డాక్టర్. తిరుమావళవన్, ఏప్రిల్ 8న నిరసన కార్యక్రమాలు చేపడతామని పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో... మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టం – దుష్పరిణామాలు అంశంపై, వీసీకే రాష్ట్ర ప్రచార కార్యదర్శి టి.ఎ. పీర్ బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం శివప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్, సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు, సీపీఐ నాయకులు తోపు కృష్ణప్ప, కోటూరి మురళి, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కోనేటి దివాకర్, న్యాయవాదులు సోమశేఖర్, సుహేల్, ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షుడు ఫైజ్ అహ్మద్ తదితరులు ప్రసంగించారు.
పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన 2025 వక్ఫ్ (సవరణ) బిల్లు, జాతీయ ఐక్యతా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. బిల్లు ముస్లిం సమాజం, మత స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే విధంగా రూపొందించబడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇతర మత సమాజాల ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోనప్పుడు, వక్ఫ్ బోర్డు వ్యవహారాల్లో మాత్రం ఎందుకు ఈ దూకుడు చూపిస్తోందని ప్రశ్నించారు. ఈ సవరణలోని ఒక నిబంధన ప్రకారం, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించే అవకాశం కల్పించారని, దీన్ని బీజేపీ పరిపాలనా పారదర్శకత అని సమర్థించు కుంటోందని, కానీ ఇది ముస్లిం సమాజం స్వయం పరిపాలనా హక్కులపై దాడి తప్ప మరేమీ కాదని విమర్శించారు. ఈ చట్టం దేశ ప్రజల ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. భారత జాతి ఐక్యతకు, స్వేచ్ఛకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగించే ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు అందరం ఏకమై, ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం స్థానిక బెంగళూరు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ముస్లింలు, ప్రగతిశీల శక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వీసీకే నేత శివప్రసాద్ కోరారు. బాస్ కోశాధికారి నీరుగట్టి రమణ, వీసీకే టౌన్ ప్రెసిడెంట్ బురుజు రెడ్డిప్రసాద్, బాస్ టౌన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ పఠాన్, స్థానిక నాయకులు చాట్ల బయన్న, సొన్నికంటి రెడ్డెప్ప, జి.వి. రమణ, గంగాధర్, ముస్లిం ప్రతినిధులు మన్సూర్, షాహిద్ బేగ్, ఇలియాజ్, రోషన్, అష్రఫ్ తదితరుల తోపాటు పెద్ద సంఖ్యలో ముస్లిం ప్రతినిధులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో
ఇండియా కూటమి పార్టీల నేతలు


