డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రస్థానం ప్రారంభమై..
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్ ఎస్.రమాదేవి కర్నూలులో డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామం కావడంతో కర్నూలు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఆమె భర్త పోలీస్ అధికారిగా ఈ మధ్యకాలంలోనే పదవీ విరమణ పొందారు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. వీరు పీలేరులో స్థిరనివాసం చేసుకున్నారు. పదోన్నతిపై అదే జిల్లాలో తహసీల్‌ద్రా్‌గా పని చేసి తరువాత వైఎస్సార్ జిల్లా ముద్దనూరు, సీకే దిన్నెలో తహసీల్దార్‌గా పని చేశారు. అక్కడి నుంచి ఆర్‌డీఓగా పదోన్నతి పొంది హెచ్‌ఎన్‌ఎస్ (హంద్రీనీవా) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమానికి పీలేరు నుంచి వస్తుండగా ఆమె సంబేపల్లె – రాయచోటి మార్గమధ్యంలో జరగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ముఖ్యమంత్రి,
జిల్లా కలెక్టర్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిలు సంతాపాన్ని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, ఆర్టీఓ శ్రీనివాసులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె మరణంతో జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమం వాయిదా పడింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో ఆమెతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణంతో అన్నమయ్య జిల్లా రెవెన్యూ శాఖలో విషాదం అలుముకుంది.


