రాజంపేట టౌన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బలిజపల్లె గంగమ్మ జాతరను ఏప్రిల్ 3వ తేదీ నిర్వహించేందుకు నిర్వాహకులు తీర్మానించారు. ఈమేరకు సోమవారం రాత్రి తొలుత బలిజపల్లెకు చెందిన జాతర నిర్వాహకులు బలిజపల్లెలో సమావేశమై జాతర తేదీని ఖరారు చేశారు. అనంతరం జాతర నిర్వహణలో భాగస్వాములైన తుమ్మలఅగ్రహారం, నారపురెడ్డిపల్లె జాతర నిర్వాహకులతో వారి గ్రామాల్లో సమావేశమై జాతర విషయమై చర్చించి ఏప్రిల్ మూడవ తేదీ జాతర నిర్వహించాలని మూడు గ్రామాలకు చెందిన నిర్వాహకులు తీర్మానించడంతో జాతర తేదీ అధికారికంగా ఖరారైంది. కాగా ఈనెల 30వ తేదీ రాత్రి బలిజపల్లె గ్రామంలో వెలసిన గంగమ్మ స్వయంభు వద్ద జాతర నిర్వహణకు వైభవంగా అంకురార్పణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శివరాత్రి ముగిసినప్పటి నుంచి జాతర ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురు చూస్తూ వచ్చిన భక్తులు జాతర తేదీ ఖరారు కావడంతో ఆనందం వ్యక్తం చేశారు.