జేసీ ఆదర్శరాజేంద్రన్
రాయచోటి అర్బన్ : క్షయవ్యాధి నివారణకు అందరూ సమస్టిగా కృషి చేద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ,సిబ్బంది స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రారంభించిన ర్యాలీని ఆయన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని 61 పంచాయతీలను టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల సర్పంచ్‌లు,సీహెచ్‌ఓలకు టీబీ ముక్త్ పంచాయతీ అవార్డులను అందచేయనున్నట్లు తెలిపారు. 2027 నాటికి టీబీని పూర్తిస్థాయిలో నివారించే కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని కోరారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ సామాజిక ప్రాంతీయ, జిల్లా అసుపత్రులలో టీబీ వ్యాధి నిర్ధారణ కోసం గళ్ల, ఎక్స్‌రే పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయితే 6నెలల వరకు ఉచితంగా డాట్స్‌ద్వారా మందులను కూడా అందచేస్తారని చెప్పారు. ఏడీఎంహెచ్‌ఓ, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారిణి శైలజ మాట్లాడుతూ జిల్లాలో 9 టీబీ యూనిట్లు ఉన్నాయన్నారు. ఆయా యూనిట్లలోని వైద్యఅధికారులు, సిబ్బంది తమ పరిధిలో టీబీ కేసులను గుర్తించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించడం, డాట్స్ ద్వారా ఉచితంగా మందులు అందచేయడం, రోగులకు ప్రధా నమంత్రి పోషణ్ అభియాన్ పథకం కింద వారి ఖాతాలో నెలకు రూ.1000లు జమచేయడం జరుగుతోందని వివరించారు. అనంతరం టీబీ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనపరచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందచేశారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డేవిడ్ సుకుమార్, డీపీఎంఓ రియాజ్‌బేగ్, వైద్యులు కోటేశ్వరి, ఆశ్విన్, రియాజ్, రెడ్డిశేఖర్‌రెడ్డి, ఆరోగ్యవిద్యాధికారి మహమ్మద్ రఫీ, టీబీ పోగ్రాం పర్యవేక్షఖులు శ్రీనివాసులు, మురళి, ప్రణీత్,భూపతి, తరుణ్,సుశీల తదితరులు పాల్గొన్నారు.