
ఎత్తెకాఫ్..ఏకాంత ఆరాధన
రాజంపేట టౌన్: రంజాన్ మాసంలో వచ్చే బడీరాత్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఎత్తెకాఫ్‌కు కూడా అంతే ఉంటుంది. రంజాన్ మాసంలో చివరి పదిరోజులు అనేక మంది ముస్లింలు ఎత్తెకాఫ్‌ను ఆచరిస్తారు. శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లాలోని అనేక మసీదుల్లో ముస్లింలు ఎత్తెకాఫ్‌ను పాటిస్తున్నారు. అల్లాహ్ ఇంటి (మసీదు) ఆతిధ్యం ఎత్తెకాఫ్ కల్పిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. రంజాన్ మాసంలో ఒక ఊరిలో ఎత్తెకాఫ్ ఉండకపోతే ఆ ఊరిపై నా కరుణ, ప్రేమాభిమానాలు ఉండవు అని పవిత్ర ఖురాన్‌లో అల్లాహ్ స్పష్టం చేశారు. ఇల్లు, కుటుంబం, వృత్తిని పక్కనపెట్టి వీలైనన్ని రోజులు లేక కనీసం 24 గంటలు అయినా మసీదులో గడపడమే ఎత్తెకాఫ్. అన్నింటిని త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే వారిపై అల్లాహ్ అత్యంత కరుణ చూపి మొరను ఆలకిస్తారని మౌల్వీలు చెబుతున్నారు. అయితే పెద్దతరహాలో ఉండే అనేక మంది పదిరోజుల పాటు ఎత్తెకాఫ్‌ను పాటించనున్నారు.
ఎత్తెకాఫ్‌కు ఎంతో ప్రాధాన్యత
రంజాన్‌మాసంలో ఎత్త్తెకాఫ్‌కు ఎంతో ప్రాధాన్యతవుంది. అల్లాహ్ సన్నిధిలో నమాజ్, జికర్, దువాచేస్తే ఆలకిస్తారు. ఒకరోజు ఎత్తెకాఫ్ పాటించినా నరకాగ్ని నుంచి అల్లాహ్ కా పాడుతారు. –మౌలానా అతాఉల్లాహ్,
ఇమామ్, నూరాని మస్జీద్,
ఈడిగపాళెం, రాజంపేట
మోక్షమార్గానికి అనువైన రోజులు
రంజాన్ మాసంలో చివరి పది రోజులు మోక్షమార్గానికి అనువైన రోజులు. ఎత్తెకాఫ్‌లో ఉన్న వారు కఠోర దీక్ష చేపట్టి ఖురాన్‌ను పఠించాలి. మసీదు గడప దాటకుండా అనుక్షణం అల్లాహ్ స్మరణలోనే ఉంటే తప్పక పుణ్యం, మోక్షం లభించడంతో పాటు ఏ పరిస్థితిలో ఉన్నా సాటి మానవుడి పట్ల ప్రేమాభిమానాలు చూపే గొప్ప మనస్తత్వం కలుగుతుంది. అందువల్లే ఎత్తెకాఫ్‌ను పాటిస్తున్నాను. –మహమ్మద్ సమీర్, ఉస్మానగర్, రాజంపేట
ఎత్తెకాఫ్ ఇలా...
ఎత్తెకాఫ్ ఉండాలంటే శుద్ధి స్నానం చేసి మసీదుకు వెళ్లి వజూ (ముఖం, చేతులు, కాళ్లను శుద్ధి చేసుకోవడం) చేయాలి. ఎత్తెకాఫ్ నియ్యత్‌ను చదవాలి. ఇతరుల నుంచి భంగం లేకుండా మసీదులో డేరా ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండాలి. తహతుల్ వజూ, తహతుల్ మజ్జీద్‌ల రెండేసి రకాత్‌ల నఫిల్ నమాజు చదవడం మంచిది. ఖురాన్ పఠనం, దువా, జికర్ ఇతర నమాజ్‌లు చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన, వజూ, గుసూల్ స్నానం కోసం మాత్రమే డేరాల నుంచి బయటకు రావాలి. మసీదు గడపదాటరాదు. సహర్, ఇఫ్తార్ ఇస్తే స్వీకరించాలి. లేదా ఇంటి నుంచి భోజనం, ఆహార పదార్దాలు తెప్పించుకోవాలి. కలిమా ఏ తయ్యిబా లాయిలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదూర్ రసూలల్లా (సొల్లెల్లాహు అలైహి వసల్లం), అస్తగ్ ఫిరల్లాహ్ బాగా పఠించాలి. సహరి కంటే ముందు 12 రకాతుల తహజూద్ (కనీసం రెండు రకాతులు) నమాజ్, సజ్‌దాలో దువా చేస్తే అల్లాహ్ సమీపం నుంచి మొర వింటారని ఖురాన్ బోధిస్తుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల కష్ట సుఖాలతో పాటు సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ ప్రార్థనలు చేయడం ఉత్తమం. ఇఫ్తార్ సమయం నుంచి మరుసటి రోజు ఇఫ్తార్ వరకు ఒకరోజు అవుతుంది.మసీదులో అడుగు పెట్టగానే ‘బిస్మిల్లాహి దాఖల్తువ అలైహి తవక్కల్‌తు వనవైతు సున్నతుల్ ఎత్తెకాఫ్ నియ్యత్ చదవాలి. ఎత్తెకాఫ్‌లో ఉన్నప్పుడు మనసును అల్లాహ్‌పైనే ఉంచాలి. ఏ ఇతర విషయాలను పట్టించుకోకూడదు.
30వ తేదీ వరకు మసీదుల్లోనే
గడపనున్న ముస్లింలు

ఎత్తెకాఫ్..ఏకాంత ఆరాధన

ఎత్తెకాఫ్..ఏకాంత ఆరాధన

ఎత్తెకాఫ్..ఏకాంత ఆరాధన