
వివాహిత అనుమానాస్పద మృతి
మదనపల్లె : కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది వివాహిత ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. వలసపల్లె పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన గణేష్ బాబు, లత(41) దంపతులు. వీరికి పరిమళ జమున ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరిమళకు రెండేళ్ల క్రితం వివాహం కాగా, జమున డిగ్రీ చదువుతోంది. గణేష్ బాబు టెంపో డ్రైవర్ గా పనిచేస్తుండగా, లత కూలీ పనులకు వెళ్తూ స్థానికంగా ఉన్న డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా కొనసాగుతోంది. డ్వాక్రా సంఘంలో రుణం తీసుకుని భర్తకు వాయిదాల పద్ధతిలో టెంపో వాహనం కొనుగోలు చేసి ఇచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైనాన్స్ లోను, డ్వాక్రా రుణం చెల్లించడంలోనూ కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక ముల్‌బాగల్ లో ఉంటున్న లత సోదరి, బావ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో వారి కుమార్తె అనాథగా మారింది. ఆ బాలికను తెచ్చి పెంచుకుందామని లత తన భర్త గణేష్ బాబును కోరింది. ముల్ బాగల్ వెళ్లి బాలికను ఇంటికి తీసుకురావాల్సిందిగా చెప్పింది. పనుల ఒత్తిడి కారణంగా గణేష్ బాబు వెళ్లకపోవడంతో, శుక్రవారం రాత్రి ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం గణేష్ బాబు జమున ఒక గదిలో నిద్రించగా లత మరో గదిలోకి వెళ్ళి కుటుంబ సభ్యులు నిద్రించాక గదిలోని రాడ్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందింది. ఉదయం నిద్ర లేచిన కుటుంబ సభ్యులు లత ఊరికి వేలాడుతుండగా గమనించి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందికి దించారు. తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళావెంకటరమణ ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకుని లత మతికి గల కారణాలను కుటుంబ సభ్యులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి పెద్ద కుమార్తె పరిమళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.