మదనపల్లె : కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాగులు, వంకలు, కుంటలు, ప్రభుత్వస్థలాలు...ఒకొక్కటిగా ఆక్రమణకు గురువుతున్నాయి. మదనపల్లె పట్టణం రోజురోజుకీ విస్తరిస్తుండటంతో భూములకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలనే ఆశతో రాజకీయ అండను ఆసరాగా చేసుకుని తమ్ముళ్లు యథేచ్చగా కబ్జాలకు పాల్పడుతున్నారు. మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ పరిధిలో జాతీయరహదారికి ఆనుకుని దాదాపు 30 ఎకరాల్లో విఘ్నేశ్వరుని కుంట విస్తరించి ఉంది. జాతీయరహదారి విస్తరణలో భాగంగా కుంట మధ్యలో రోడ్డును ఏర్పాటుచేయడంతో రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో కుంట ఓ వైపుకు వెళ్లిపోగా, మరోవైపు ఖాళీస్థలం ఏర్పడింది. హైవేకు ఆనుకుని ఉండటం, కోట్ల విలువైన స్థలం కావడంతో కబ్జారాయుళ్లు తెలివిగా... మట్టి, వ్యర్థాలను తీసుకువచ్చి మెల్లమెల్లగా కుంటను చదునుచేయడం ప్రారంభించారు. ప్రతిరోజు ట్రాక్టర్లలో ఇళ్ల వ్యర్థాలు, మట్టిపెళ్లలు, రాళ్లను తీసుకువచ్చి కుంటకు ఆనుకుని దించడం, ఎవరూ లేని సమయంలో జేసీబీని తీసుకువచ్చి చదునుచేయడం చేస్తున్నారు. దీనిపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేస్తే, వారు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిందిగా పేర్కొని చేతులెత్తేశారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు రాకపోవడంతో కబ్జారాయుళ్లు భూమికి దొంగపట్టాలు సృష్టించే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికై నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా విఘ్నేశ్వరునికుంట సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టితో చదునుచేసి ఆక్రమిస్తున్న
కబ్జారాయుళ్లు
కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు