బి.కొత్తకోట: విధుల్లో ఉండే అటవీశాఖ యంత్రాంగం అడవులను సంరక్షించుకునేందుకు సాంకేతిక సహకారంతో సత్ఫలితాలు సాధించొచ్చని వైల్డ్‌లైఫ్ సెంట్రల్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ (చైన్నె) ఆదిమల్లయ్య, రాజంపేట డీఎఫ్‌ఓ జగన్నాఽథ్‌సింగ్, లీగల్ విభాగం న్యాయవాది బలరాం అన్నారు. శుక్రవారం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై జిల్లాలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు 70మందికి వైల్డ్‌లైఫ్, ఏఐ, న్యాయ అంశాలపై ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన చట్టాల మేరకు ఎవరైనా వన్యప్రాణిని చంపితే దానికి విధించే అపరాధ రుసుం భారీగా పెంచారని అన్నారు. గతంలో రూ.25వేల జరిమానా ఉండేదని, ఇప్పుడు రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు విధించవచ్చని, డీఎఫ్‌ఓ స్థాయి అధికారి రూ.5 లక్షలకు మించి విధించే అవకాశం ఉందన్నారు. ఎర్రచందనం ఆక్రమ రవాణా, నిందితులను గుర్తించడం తదితర విషయాల్లో సాంకేతిక సహకారం తీసుకోవాలని సూచించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని గుర్తించే సాంకేతిక విధానం అందుబాటులో ఉందన్నారు. ఎక్కడైనా అడవిలో నిప్పు పడితే అక్కడ వచ్చే పోగ ఆధారంగా శాటిలైట్ అటవీశాఖను అప్రమత్తం చేస్తుందని, ఏ ప్రాంతంలో మంటలు వ్యాపించాయో ఆ ప్రాంత అటవీశాఖ సిబ్బంది మొబైల్ ఫోన్లకు సమాచారం వెళ్తుందని అన్నారు. సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలు తీసుకుంటారని తెలిపారు. అధికారులు, సిబ్బంది చాట్‌జీపీటీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సబ్‌డీఎఫ్‌ఓలు సుబ్బరాజు, బాలరాజు, శ్రీనివాసులు,ఎఫ్‌ఆర్‌ఓలు జయప్రసాద్‌రావు, వైసీ.రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ప్రియాంక, శ్యామసుందర్, ధీరజ్, దత్తాత్రేయ, హార్సిలీహిల్స్ సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక సహకారంతో అడవుల సంరక్షణ