
జీతం బకాయిలను చెల్లించాలి
రాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు 15 నెలలుగా జీతం బకాయిలను చెల్లించకుండా వేధిస్తోందని, వారికి వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులతో కలసి ఆయన డీఆర్‌ఓ మధుసూదన్‌ను కలసి సమస్యలపై విన్నవించారు. ఆయన మాట్లాడుతూ సకాలంలో జీతాలందకపోవడంతో ఉద్యోగుల కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు జీతాలు విడుదల చేయించాలని కోరారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకట్రామయ్య, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ్లైయాష్ వ్యవహారంపై విచారణ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో ఫ్‌లైయాష్ రవాణా వ్యవహారంపై ఏపీజెన్‌కో యాజమాన్యం రహస్యంగా విచారణ చేపట్టింది. గురువారం ఏపీజెన్‌కో నుంచి కొందరు అధికారులు విచారణ నిమిత్తం ఆర్టీపీపీకి వచ్చారు. గతంలో ఫ్‌లైయాష్ విషయంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో ముగ్గురు అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఫ్‌లైయాష్ వ్యవహారంపై రహస్యంగా విచారణ చేపట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది.