
వాహనం ఢీకొని జింకపిల్ల మృతి
బి.కొత్తకోట : రోడ్డు దాటుతున్న మూడు నెలల వయసున్న జింక పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం బి.కొత్తకోట సమీపంలోని బాలసానివారిపల్లి వద్ద జరిగింది. జింకపిల్ల రోడ్డుపై గాయాలతో పడి ఉండగా స్థానికులు గుర్తించి పశువైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు విరిగిన కాలుకు కట్టుకట్టి మందులు తాపించారు. అయినప్పటికి మృతి చెందింది. అటవీశాఖ బీటు అధికారి ప్రకాష్ వివరాలను సేకరిస్తున్నారు.
గిరిజనులపై దాడులు అరికట్టాలి
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లాలో గిరిజనులపై జరిగే దాడులను అరికట్టాలని ఏపీ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేంద్రనాయక్ చౌహాన్ డిమాండ్ చేశారు. రాయచోటిలో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోజు రోజుకు గిరిజనులపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. గుర్రంకొండ, మదనపల్లెలలో కొంత మంది గుండాలు దాడులు చేసినా ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు.
చిన్నారి సంబంధీకులు
స్పందించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఉమాశంకర్‌కాలనీ ఆదర్శ పాఠశాల వద్ద గుట్టలో వదిలేసి వెళ్లిన చిన్నారి సంబంధీకులు 30 రోజుల్లోగా తమను సంప్రదించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పి.రమాదేవి తెలిపారు. బుధవారం ఆమె రాయచోటిలో మాట్లాడుతూ 3 నుంచి 5 రోజుల ఆడ శిశువును ములకలచెరువు ఆదర్శ పాఠశాల వద్ద వదిలి వెళ్లిపోయారన్నారు. ఆ చిన్నారి తమ సంరక్షణలో ఉందన్నారు. ఎవరూ స్పందించకుంటే ఈ పాపను అనాథగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత ఇస్తామన్నారు.
కందిపంటకు నిప్పు
పెద్దమండ్యం : గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 3 ఎకరాలలో ఓ రైతు సాగుచేసిన కందిపంట అగ్నికి ఆహుతైంది. మండలంలోని ఎన్‌ఓ పల్లె పంచాయతీ గౌనివారిపల్లెకు సమీపంలో ఈ ఘటన జరిగింది. రైతు కథనం మేరకు.. కలిచెర్ల పాతూరుకు చెందిన సయ్యద్ అలీ అక్బర్ తనకున్న 3 ఎకరాలలో కందిపంటను సాగు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కందిపంట మొత్తం కాలిపోయింది. ప్రత్యామ్నాయ పంటగా సాగుచేసిన కందిపంట చేతికి వచ్చే సమయంలో అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రూ. 1 లక్ష నష్టం జరిగినట్లు తెలిపాడు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా కాలిపోయిన పంటను వీఆర్‌ఓ పరిశీలించారు.

వాహనం ఢీకొని జింకపిల్ల మృతి