రామాపురం: వైఎస్సార్‌సీపీ వర్గీయులను చిల్లర కొట్టు దగ్గర కూర్చోబెట్టుకోవడమే.. వికలత్వం కలిగిన వృద్ధుడు డేరంగుల వెంకటరమణ (74) చేసిన తప్పు. పర్యవసానంగా స్థానికంగా ఉన్న టీడీపీ రౌడీ మూకలు.. చిల్లర బంకే జీవనాధారంగా, నడవలేని స్థితిలో జీవనం సాగిస్తున్న అతనిపై కక్ష కట్టారు. ఎన్నికల తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, మూడు పర్యాయాలు.. ఆ బంకుపైకి దాడికి తెగబడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కొంత మంది టీడీపీ రౌడీ మూకలు.. అతనితోపాటు బంకుపై దాడి చేశారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లిలో 74 ఏళ్ల వృద్ధుడు డేరంగుల వెంకటరమణ వేరే జీవనాధారం లేక.. చిల్లర కొట్టు దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని స్వయం శక్తితో జీవనం సాగిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. గ్రామంలోనీ వైఎస్సార్‌సీపీకి చెందిన కొంత మంది వర్గీయులను బంకు దగ్గర కూర్చోబెట్టుకోవడం అతను చేసిన పాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు అతనిపై కక్ష కట్టారు. 40 ఏళ్లుగా వున్న బంకును తొలగించాలని ఆరు నెలల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో అతను ఇటీవల జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించడంతో తహసీల్దార్ ద్వారా విచారణ చేసి.. న్యాయం చేశారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి ఆటోలలో వచ్చి తమపై దాడి చేసి బంకు పేకిలించే ప్రయత్నం చేశారని, బంకులోని సామగ్రిని బయటపడేసి, అరుగు బండలను ధ్వంసం చేశారని ఎస్పీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలతో కలిసి వృద్ధుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వృద్ధ వికలాంగుడిపై దాడి
అతని జీవనాధారం చిల్లర బంకు ధ్వంసం
వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు అంగడి దగ్గర కూర్చుంటున్నారని కక్ష
బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు