రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర ప్రవేశానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖా ధికారి కె.సుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి మే 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
ముగిసిన నామినేషన్ల పర్వం
రాజంపేట: రాజంపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల పర్వం ముగిసింది. బుధవారం నామినేషన్ల స్క్రూట్నీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఈవో సురేష్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా రెండవ రోజు కృష్ణకుమార్ తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. హనుమంతనాయుడు, కృష్ణకుమార్ ప్యానల్‌ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది.
29న న్యాయవాదుల
సంఘం ఎన్నికలు
రాయచోటి అర్బన్: ఏపీ బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నెల 29న రాయచోటి బార్ అసోసియేషన్‌కు సాధారణ ఎన్నికలు జరిగేలా రాయచోటి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఎన్.ప్రభాకరరెడ్డి, కార్యదర్శి పి.రెడ్డెయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సీనియర్ న్యాయవాది రాజకుమార్‌రాజు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఇలియాస్ బాషాను ఎగ్జిక్యూటివ్ కమిటీ నియమించిందన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీలలో నామినేషన్లు దాఖలు చేయవచ్చునని పేర్కొన్నారు. 24న ఽనామినేషన్ల పరిశీలన, 25న ఉపసంహరణకు సమయం ఉంటుందన్నారు. 29న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మేరకు ఎన్నికల అధికారి రాజకుమార్‌రాజు నోటిఫికేషన్ విడుదల చేశారు.
మెరుగైన పరిహారం ఇవ్వాలి
గాలివీడు: భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మండల పరిధి తూముకుంట గ్రామ పంచాయతీలోని దిగువమూలపల్లిలో సీపీఎం మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరికి 40 ఏళ్ల నుంచి సాగులో ఉన్న భూమిని సోలార్ ప్రాజెక్టు పేరుతో తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడిందని తెలిపారు. అయితే వీరికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని పేర్కొన్నారు. భూమికి భూమి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటికి ఒక ఉద్యోగం, పునరావాసం తదితరాలు ప్రభుత్వాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సర్వేయర్ సస్పెన్షన్
బి.కొత్తకోట: పీటీఎం మండలం టీ.సదుం సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రను సస్పెన్షన్ చేస్తూ జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీలో జరిగిన భూముల వ్యవహరంపై తహసీల్దార్ అజారుద్దీన్, సర్వే డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ పంపిన నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. గుమ్మసముద్రం పంచాయతీలో జరిగిన భూముల రీసర్వేలో రాజేంద్ర పని చేశారు. గండువారిపల్లె గ్రామానికి చెందిన భూముల విషయంలో అన్ని సర్వే నంబర్లు జాయింటు భాగాలు, విస్తీర్ణంలో తేడాలు వేయడం, ప్రభుత్వ భూమిని తల్లిపేరుతో ఆన్‌లైన్ చేయించుకోవడంపై గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గండువారిపల్లె సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై విచారణ చేసిన అధికారులు వేర్వేరుగా నివేదికలను పంపగా చర్యలు తీసుకున్నారు. దీనిపై మంగళవారం తహసీల్దార్ అజారుద్దీన్ మాట్లాడుతూ రాజేంద్రను సస్పెన్షన్ చేయడంతోపాటు ఆరోపణలపై సమగ్ర విచారణకు సర్వే డెప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు నియమించారని చెప్పారు.
దరఖాస్తుల ఆహ్వానం