మదనపల్లె : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటనను, రాజకీయ దురుద్దేశంతో కుట్ర పూరితంగా జరిగిందనే కోణంలో ప్రజలను నమ్మించేందుకు కూటమి సర్కార్ అల్లిన కట్టుకథే మదనపల్లె ఫైల్స్ అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మనూజారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె ఫైల్స్ ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న గౌతమ్‌తేజ్‌కు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్షలో నేర నిరూపణ నిర్ధారణ కాలేదని నివేదికలో వెల్లడించడంతో పాటు ఎవరి ప్రమేయం లేదని హైకోర్టు నిర్ధారించిందన్నారు. అగ్నిప్రమాద ఘటన రాత్రి 11.30 గంటలకు జరిగితే.. గౌతమ్‌తేజ్ 10.40 గంటలకు సబ్ కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారని, సీసీ కెమెరా ఆధారాలు ఉన్నాయన్నారు. ఘటనలో ప్రభుత్వం పేర్కొన్న ఏ–1 ముద్దాయి గౌతమ్‌తేజకు ప్రమేయం లేదని తెలుస్తుంటే, ఎవరి ప్రోద్బలంతోనే జరిగిందని ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అభియోగాలు మోపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎల్లో మీడియాలో పెద్దిరెడ్డి కుటుంబంపై 20 నుంచి 30 అసత్య కథనాలు, అభియోగాలు మోపారని, వాటిలో ఏ ఒక్కటి రుజువు చేయలేకపోయారన్నారు. రెండురోజుల క్రితం పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో వ్యక్తిగత విభేదాలతో దాయాదుల మధ్య గొడవ జరిగి హత్యకు దారితీస్తే.. వైఎస్సార్ సీపీకి ఆపాదిస్తూ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా వైఎస్సార్‌సీపీకి ఆపాదిస్తూ మాట్లాడటం కూటమి నాయకులకు అలవాటైపోయిందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు హర్షవర్దన్‌రెడ్డి, కొమ్మేపల్లె శ్రీనివాసులురెడ్డి, జన్నే రాజేంద్రనాయుడు, నీరుగట్టి మేరీ, బి.రేవతి, ఈశ్వర్‌నాయక్, సురేంద్ర, మస్తాన్‌రెడ్డి, కోటూరి ఈశ్వర్, అంబేద్కర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.