భక్తి పారవశ్యం.. ప్రేమ వాత్సల్యం | - | Sakshi
Sakshi News home page

భక్తి పారవశ్యం.. ప్రేమ వాత్సల్యం

Mar 18 2025 12:47 AM | Updated on Mar 18 2025 12:44 AM

మదనపల్లె సిటీ : మానవుల ఆలోచనాత్మక శిక్షణ.. ఆచరణాత్మక సంస్కరణ.. ఆధ్యాత్మిక వికాసం.. ఆత్మీయత, అనురాగాల అనుబంధం.. ఆకలి నుంచి ఔన్నత్యానికి దైవం అందించిన మహత్తర అవకాశం రంజాన్‌ మాసం. పవిత్ర వాతావరణంలో శారీరక, మానసిక, సాధనతో నైతిక ప్రగతి సుసాధ్యం అని ఇస్లాం బోధిస్తుంది. భక్తి పారవశ్యానికి ప్రతీక అయిన ఈ మాసం ప్రేమ.. వాత్సల్యాన్ని పంచుతోంది. విధిగా దానం(జకాత్‌) ద్వారా పేదలను అక్కున చేర్చుకునే శుభాల వసంతం రంజాన్‌ మాసం.

జిల్లాలో రంజాన్‌ మాసం సందర్భంగా శారీరక, ఆధ్యాత్మిక వికాసానికి సాధనమైన ఉపవాసాలు కొనసాగుతున్నాయి. మసీదుల్లో రంజాన్‌ సూచికగా తరావీల రూపంలో దివ్యఖురాన్‌ ఆయత్‌లు ప్రతి చోట వినిపిస్తున్నాయి. రంజాన్‌ నెల వంక దర్శనమైనప్పటి నుంచి మసీదు కమిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్‌, సహర్‌ వేళలను పాటిస్తూ ఉపవాసాలు చేస్తున్నారు. సహనం, క్రమశిక్షణ లాంటి మహోన్నత వ్యక్తిత్వాలను అలవర్చే రోజా వ్రతాలను ఉపవాసదీక్షాపరులు భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు.

ఆధ్యాత్మిక వికాసానికి స్వాగత ద్వారం..

రంజాన్‌ నెల ఆధ్యాత్మిక స్వాగత ద్వారం లాంటిదని ముస్లింల భావన. అన్ని దుష్టకార్యాల నుంచి రక్షణ పొందేందుకే రంజాన్‌ శిక్షణగా భావిస్తారు. నెల రోజులు పాటించే ఆచరణలు మిగిలిన జీవితంలో కూడా చేపట్టాలన్నదే రంజాన్‌ శిక్షణ ధ్యేయం. ఉపవాసాలు పాటించే ముస్లింలు ఈర్ష్య, ద్వేషం, అసత్యం పలకడం తదితర దుర్గుణాలను త్యజిస్తారు. ఉపవాసదీక్షాపరుల్లో పవిత్రత నెలకొంటుంది. రాగద్వేషాలకు తావులేని వాతావరణం వెల్లివిరిస్తుంది. ఎలాంటి చెడులు లేని ప్రశాంత జీవితం దక్కుతుంది. ఉపవాసదీక్ష పాటించిన ప్రతి ముస్లింని రోజా పరిణితి కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.

ఆత్మీయత, అనురాగాలు..

రంజాన్‌ నెలంతా ప్రతి ముస్లిం ఇంట్లో దైవారాధనలు, పవిత్ర ఉపవాసదీక్షలు, పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక చింతన వెల్లివిరుస్తుంది. ఉపవాసం పాటించేవారు తెల్లవారకముందే లేచి భోజనం ఆరగించాలి. దీన్ని సహరి అంటారు. సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు సైతం ముట్టరు. అనంతరం మసీదు సైరన్‌తో ఉపవాసం ముగిస్తారు. దీన్ని ఇఫ్తార్‌ అంటారు. మసీదులన్నీ నమాజులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర ఖురాన్‌ పఠనంతో తన్మయులవుతారు.

దయాగుణం అలవడుతుంది..

రంజాన్‌మాసం కొందరు ముస్లింలలో ఉన్న పిసినారితనం, ధనార్జన గుణం తదితర దుర్గుణాలను పోగొట్టి, దానగుణాన్ని పెంపొందిస్తుంది. ఈ నెలలో దానధర్మాలు అధికంగా చేయాలని మహమ్మద్‌ ప్రవక్త బోధించారు. ఒక్కొక్క పుణ్యకార్యానికి 70 రెట్లు అధిక పుణ్యఫలం ప్రసాదిస్తాడని ప్రవక్త బోధించారు. దీంతో ఆర్థికంగా సహాయం అందుతుంది. తమ సంపాదనలో 2.5 శాతం ధనాన్ని పేదలకు పంచాలని అల్లాహ్‌ ఖురాన్‌లో శాసనం చేశారు. సదఖా, జకాత్‌, ఫిత్రా దానాల ద్వారా పేదలకు రంజాన్‌ నెలలో ఆనందోత్సవాలతో పండుగ జరుపుకుంటారు. దీంతో వారి అవసరాలు తీరుతాయి. ఫలితంగా సమసమాజ స్థాపన జరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా జకాత్‌ ఉపయోగపడుతుంది. రంజాన్‌ నెలంతా ఇలా భయ, భక్తులతో ఉపవాసాలను పాటిస్తూ నమాజులను ఆచరిస్తూ ధాన, ధర్మాలను చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ముస్లింలు గడుపుతారు. తరావీ నమాజులో ఇమామ్‌ల ద్వారా ఖురాన్‌లో కొంత భాగాన్ని రోజూ ఆలకిస్తారు. ఇలా చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. త్రికరణ శుద్ధిగా ఖురాన్‌ బోధనలను పఠిస్తారు.

మృదు స్వభావం..

సమాజంలో పేదసాదల ఆకలిదప్పులను రోజా(ఉపవాసదీక్షలు)లు తెలుపుతాయి. తోటివారి వ్యథాభరిత జీవితాన్ని కళ్లకు కడుతుంది. దీంతో తమ తోటివారు అనాథలు, అణగారిన వారిపై జాలి కలుగుతుంది. తద్వారా మృదుస్వభావం అలవడుతుంది. దీంతో వారి బాధలను కష్టాలని తీర్చేందుకు పాటుపడతారు.

వ్యవసనాలకు దూరంగా..

తాగుడు, జూదం, మత్తు పదార్థాలను నమలడం లాంటి దురలవాట్లు 16 గంటల పాటు దూరమైతే ఆ వ్యక్తిలో ఆయా వ్యసనాలను త్యజించే మానసిక సంసిద్ధత ఉద్భవిస్తుందని నమ్మకం. ఉపవాసాలు మనిషి అన్ని చెడులను దూరంగా చేసి, సత్కార్యాలను దగ్గర చేస్తాయి. అత్యుత్తమ శిక్షణనిస్తాయి.

దివ్య సుగంధాలను వెదజల్లుతున్న రంజాన్‌

ఉపవాసదీక్షాపరులతో మసీదులు కళకళ

ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణం

ప్రవక్త బోధనలు పాటించాలి..

రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసదీక్షలతో పాటు మహమ్మద్‌ ప్రవక్త బోధనలు పాటించాలి. రంజాన్‌ మాసంలో 30 రోజుల పాటు చేపట్టే ఉపవాసదీక్షలతో పేదల ఆకలి, బాధ తెలుస్తుంది. దీంతో పేదలను ఆదుకోవడం జరుగుతుంది. రంజాన్‌ మాసంలో ప్రతి ముస్లిం ఏదో విధంగా పేదలను ఆదుకోవాలి. పేదరికం లేని సమాజ నిర్మాణమే రంజాన్‌ ఆశయం.

–మౌలానా జలాలుద్దీన్‌సాహెబ్‌, ప్రభుత్వఖాజీ, మదనపల్లె

భక్తి పారవశ్యం.. ప్రేమ వాత్సల్యం1
1/2

భక్తి పారవశ్యం.. ప్రేమ వాత్సల్యం

భక్తి పారవశ్యం.. ప్రేమ వాత్సల్యం2
2/2

భక్తి పారవశ్యం.. ప్రేమ వాత్సల్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement