మదనపల్లె : కట్టుకున్న భర్త తన బిడ్డను చంపేస్తాను అంటూ బెదిరిస్తూ.. స్వగ్రామానికి రానీయకుండా... వేధింపులకు గురి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని... తనకు తన బిడ్డకు రక్షణ కల్పించి కాపాడాలని వివాహిత తన చంటి బిడ్డతో పాటు జన జాగృతి సంస్థ అధ్యక్షురాలు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బాలజ్యోతితో కలిసి శనివారం ప్రెస్‌క్లబ్‌లో తన గోడు విన్నవించింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ బి.కొత్తకోట పట్టణానికి చెందిన కృష్ణ, అమృత దంపతులకు భువనేశ్వరి ఒక్కటే కుమార్తె. ఈమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో బి.కొత్తకోటకు చెందిన మేనత్త శంకరమ్మ చేరదీసి పెంచి పెద్ద చేసింది. అయితే అనాథ కావడంతో పెళ్లీడు రాకుండానే బంధువులు 13వ ఏట మైనర్‌గా ఉన్న భువనేశ్వరి(17)కి మొలకలచెరువు మండలం, కొక్కంటి క్రాస్ ఎరచ్రెరువుపల్లెకు చెందిన శివకుమార్ కు ఇచ్చి బలవంతపు వివాహం జరిపించారు. పైళ్లెన నాటినుంచే భువనేశ్వరికి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, ఆడపడుచు చిత్రహింసలకు గురి చేయడం, తీవ్ర ఇబ్బందులు పెట్టడం చేశారు. ఏడాది తర్వాత భువనేశ్వరి గర్భం దాల్చగా ఇది ఇష్టం లేని అత్తింటి వారు ఇంటి నుంచి గెంటేశారు. అప్పటి నుంచి మేనత్త శంకరమ్మ ఇంటివద్దే కుమార్తె జాహ్నవి (02) కి జన్మనిచ్చింది. అప్పటినుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం చేస్తోంది. కొన్నాళ్ల క్రితం పెద్ద మనుషులు పంచాయితీ చేయడంతో , భర్త శివకుమార్‌తో బి.కొత్తకోటలో వేరు కాపురం పెట్టారు. అయితే చంటి బిడ్డను మేనత్త శంకరమ్మ వద్ద ఉంచారు. భర్త జులాయిగా మారి వేధింపులకు గురి చేయడంతో, కుమార్తెను శంకరమ్మ వద్ద ఉంచి నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం బెంగళూరు వెళ్లింది. అప్పటినుంచి బి.కొత్తకోటకు నిన్ను రానివ్వనని ఒకవేళ వస్తే నీతో పాటు నీ బిడ్డను కూడా చంపేస్తానంటూ శివ కుమార్ తీవ్రంగా ప్రతిరోజు బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో శంకరమ్మ వద్ద ఉన్న జాహ్నవిని శివకుమార్ తన బంధువులతో కలిసి వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆమె అడ్డుకుంది. ఈనేపథ్యంలో బాధితురాలు భువనేశ్వరి తనకు, తన బిడ్డకు, మేనత్తకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతోంది.