మదనపల్లె : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ (55) శనివారం తన సోదరుడు వెంకటరమణ చేతిలో హత్యకు గురికావడాన్ని నిరసిస్తూ మృతుని బంధువులు, గ్రామస్తులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట నడిరోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కృష్ణాపురం వద్ద శనివారం స్థానికుడైన రామకృష్ణను పాత కక్షల కారణంగా అతని సోదరుడు వెంకటరమణ కొడవలితో నరికి దాడి చేశాడు. ఈ ఘటనలో కొన ఊపిరితో ఉన్న రామకృష్ణను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు. అంబులెన్స్ వాహనంలో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రామకృష్ణ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం రామకృష్ణ మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకోవడంతో, పెద్ద ఎత్తున మృతుని బంధువులు సన్నిహితులు, కృష్ణాపురం గ్రామస్తులు జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా ఆసుపత్రి ఎదుట కదిరి రోడ్డులో వాహనాలను అడ్డుగా ఉంచి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదులను సీఐ,ఎస్‌ఐ, డీఎస్పీ పట్టించుకోలేదని వారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, వన్‌టౌన్ సీఐ ఎరీషా వలీ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ధర్నా విరమింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆసుపత్రిలోని మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుల వద్దకు వచ్చి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్‌రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తదితరులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.