రాజంపేట రూరల్ : విశాఖ స్టీల్ ఫ్లాంట్‌లో పని చేసే ఒప్పంద కార్మికుల అక్రమ తొలగింపును నిలిపివేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, సీపీఐ జాయింట్ సెక్రటరీ పి.మహేష్, భవన నిర్మాణ సంఘం జిల్లా అద్యక్షుడు గాలి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఇ.సికిందర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్లాంట్‌లో 15వేలకు పైగా ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. అధిక శాతం కార్మికులు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులే అన్నారు. వారిలో ఇప్పటికే 900 మంది కార్మికులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి 1400 మంది చొప్పున మొత్తం 5600 మందిని తొలగించే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఒక పక్క రక్షిస్తామని చెబుతూనే మరోక వైపు ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.