మదనపల్లె : దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడంపై బాధితులు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి మిద్దేపల్లి బాలాజి ఆద్వర్యంలో గురువారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్‌ను ఆశ్రయించి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు మిద్దేపల్లి బాలాజీ మాట్లాడుతూ ఈనెల 9 తేదీన మండలంలోని వలసపల్లె పంచాయతీ బొగ్గిటివారిపల్లెలో గ్రామకంఠం భూమి విషయమై, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కొందరు దళితులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. దాడిలో వెంకటస్వామి తీవ్ర గాయపడి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఇతనితో పాటు నారాయణ, రజిత, రత్నమ్మ, కృష్ణవేణి తదితరులు గాయపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై, గురువారం తాలూకా సీఐ కళా వెంకటరమణను సంప్రదించగా, సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ విషయమై ఎక్కువ మాట్లాడితే మీపైనే కేసులు పెడతానని తీవ్రంగా హెచ్చరించారన్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించి దాడి చేసిన వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరామన్నారు. సబ్ కలెక్టర్‌ను కలిసిన వారిలో బీఎస్పీ నాయకులు ఉదయ్, నరసింహులు, బాధితులు నారాయణ, వెంకటస్వామి, రత్నమ్మ, సురేంద్ర తదితరులు ఉన్నారు.