రామాపురం : మండలంలోని నీలకంట్రావుపేట గ్రామ పంచాయతీ సద్గురు సాయి దర్బార్ నగర్‌లో వెలసిన సద్గురు హజరత్ దర్బార్ అలీషా వలీ, రహమతుల్లా అలై బాబా, జలీల్‌మస్తాన్ వలీ బాబా గార్ల గంధం ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. మొక్కులు గల భక్తులు జెండాలకు గంధం పూసి ఇంటి వద్ద నుంచి డప్పు వాయిద్యాల నడుమ దర్గా వద్దకు చేరుకొని చెట్ల దగ్గర జెండాలను ఏర్పాటు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్గాలో ఉదయం నుంచే భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ ఇతర ఏ సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉరుసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి, మండల ఎస్‌ఐ వెంకటసుధాకర్‌రెడ్డిలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
కొండకు నిప్పు పెట్టిన ఆకతాయిలు
సిద్దవటం : మండలంలోని ఫారెస్టు చెక్ పోస్టు సమీపంలో గరువారం సాయంత్రం ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో కొండ తగలబడింది. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటంతో చెట్ల ఆకులు రాలిపోయి అటవీ సంపద మంటల ధాటికి తగల బడింది. దీంతో అడవిలో ఉన్న వన్యప్రాణులు, జంతువులు, పక్షులు ఎగిసిపడిన మంటలకు కకావికలమయ్యాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా మంటలు ఎగిసి పడటంతో ప్రయత్నం ఫలించలేదని స్థానికులు తెలిపారు.
రెండు లారీలు ఢీ
సిద్దవటం : మండలంలోని కడప– చె న్నై ప్రధాన రహదారిలోని మందగిరి శనేశ్వరస్వామి ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఒకలారీ అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. చైన్నె నుంచి కర్ణాటకకు వెళుతున్న లారీ, ఎర్రగుంట్ల నుంచి రాజంపేట వైపు వెళుతున్న మరో లారీ శనేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఢీకొన్నాయి. కర్ణాటకకు వెళుతున్న డ్రైవర్ నాగరాజు నిద్రమత్తులో ఉన్నందు వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఒంటిమిట్ట సీఐ బాబును వివరణ కోరగా గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
భూ వివాదం కారణంగా ఘర్షణ
– ఏడుగురికి గాయాలు
మదనపల్లె : భూవివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. మండలంలోని అంగళ్లుకు చెందిన రెడ్డప్ప రెడ్డి స్థానికంగా రైస్ మిల్ నిర్వహిస్తున్నాడు. అతనికి తన భార్య పార్వతమ్మ పేరుపై స్థానికంగా సర్వే నెంబర్ 235, 236లలో కొంత భూమి ఉంది. ఈ భూమిపై తుమ్మచెట్లపల్లెకు చెందిన పులగంటి రెడ్డప్ప, శ్రీనివాసులు , మొలకవారిపల్లెకు చెందిన శ్రీనివాస్ రెడ్డి లతో కొంతకాలంగా వివాదం ఉంది. భూవివాదానికి సంబంధించి కోర్టులో రెడ్డప్ప రెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో, తన భూమి సర్వే చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా గురువారం రెవెన్యూ అధికారులు సర్వేకు వస్తున్న విషయం తెలుసుకున్న మరో వర్గంలోని పులగంటి రెడ్డప్ప, శ్రీనివాసులు, మొలకవారిపల్లి శ్రీనివాసులు రెడ్డిలు రైస్ మిల్ యజమాని రెడ్డప్పరెడ్డితో గొడవకు దిగారు. తమ అనుచరులతో వచ్చి కరల్రు సమ్మెట, చురకత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడిలో రెడ్డప్ప రెడ్డి (60), ఆయన భార్య పార్వతమ్మ(55), వారి బంధువులు శంకర్ రెడ్డి(46), భార్గవ్ రెడ్డి (28), సాంబశివరెడ్డి (27), చిన్నపరెడ్డి(55), పాలకొండ్రెడ్డి (28) తీవ్రంగా గాయపడ్డారు.ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘనంగా గంధం ఉత్సవం
ఘనంగా గంధం ఉత్సవం