● ఐదు సూత్రాలు అనుసరించాలంటున్న ఇస్లాం
● ఈమాన్, నమాజ్, రోజా, జకాత్,
హజ్ యాత్ర చేయాలని సూచన
● అల్లాహ్ మార్గంలో
నడవాలంటున్న పెద్దలు
రాజంపేట టౌన్ : పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. అందువల్ల అనేక మంది ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ స్మరణలో ఉంటున్నారు. అయితే కొంతమంది తమ విధుల నిర్వహణ వల్ల రంజాన్ మాసంలో చేపట్టే పవిత్ర కార్యక్రమాలు చేపట్ట లేకపోతున్నారు. ఇంకొంత మంది పెద్దల మాట పెడచెవిన పెట్టి ఈ పవిత్ర మాసంలో చేపట్టాల్సిన పుణ్యకార్యాలను చేయడం లేదు. అయితే పవిత్ర రంజాన్ మాసంలో కనీసం కొన్ని రోజులైనా ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ స్మరణలో ఉండాలని ముస్లీం మతపెద్దలు చెబుతున్నారు. అప్పుడే మనిషి మంచి మార్గంలో పయనించి ఇతరుల పట్ల ప్రేమ, దయ కలిగి వుండటంతో పాటు పేదల ఆకలి బాధలు కూడా తెలుసుకోగలరని, తద్వారా ఆకలితో బాధపడే పేదల ఆకలి తీర్చగల గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని వారు చెబుతున్నారు.
సర్వమానవాళి శాంతిమార్గంలో నడవాలని ఇస్లాం సూచిస్తుంది. ప్రతి ఒక్కరు చెడుకు దూరంగా, సన్మార్గంలో నడవాలని బోధిస్తుంది. అల్లాహ్ ప్రసాదించిన పవిత్ర గ్రంధం దివ్యఖురాన్. ఈ గ్రంధం అవతరించింది రంజాన్ మాసంలోనే. ఈ మాసంలో ముస్లీంలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మికంగా గడిపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను మహమ్మద్ ప్రవక్త సూచించారు. అవే ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర. వీటిలో నమాజ్, రోజా, జకాత్‌ను ప్రతి ముస్లీం రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించాలి. మరోవైపు మంచి విద్య నేర్చుకునేందుకు, ఇతరులకు బోధించేందుకు అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలని మతపెద్దలు చెబుతున్నారు.
ఈమాన్..
ఇస్లాం మత మొదటి నియమం ఈమాన్. లాయిలాహ ఇల్లల్లాహ్ మహమ్మదూర్ రసూలల్లా (సొల్లెల్లాహు అలైహి వసల్లం) అని కలిమా తయ్యిబా చదివి ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరు అందుకు కట్టుబడి ఉండాలి. అల్లాయే భగవంతుడని, ఇతరులకు దైవారాధన చేయరాదని ఈ విషయం చెబుతుంది. ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాపై మాత్రమే విశ్వాసాన్ని ఉంచాలి.
నమాజ్..
కలిమా తయ్యిబా చదివి ఈమాన్‌తో ఇస్లాం స్వీకరించిన ప్రతి ముస్లీం రోజుకు ఐదు పూటలా విధిగా నమాజ్ చదవాలి. సూర్యోదయానికి ముందు ఫజర్, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత జోహర్, సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అసర్, సూర్యాస్తమయం తరువాత మగ్‌రిబ్, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇషా నమాజు చేయాలి.
రోజా..
రోజా అంటే ఉపవాస దీక్ష. మానసిక పరిపక్వత కలిగి, ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి ముస్లీం రంజాన్ మాసంలో రోజా పాటించాలి. ఈ మాసంలో ఉండే రోజాలను ఫజర్ రోజా అంటారు. నెలంతా నియమ, నిష్టలతో ఉపవాస దీక్ష ఆచరించాలి. సూర్యోదయం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం తరువాత వరకు ఆహారం, నీరు, ఇతర ఎలాంటి తినుబండారాలు, పానీయాలను సైతం తీసుకోకుండా రోజా ఆచరించాలని ఇస్లాం చెబుతుంది. ఏడాదిలో 12 నెలల్లో ఒకనెల అల్లా కోసం ఆయన సూచించిన మార్గంలో నడిచి మిగతా నెలల్లో అదే స్ఫూర్తితో నడుచుకోవాలి.
జకాత్..
ధనవంతులు, దానం చేయగల ఆర్థిక స్థోమత కలిగిన వారందరు విధిగా వస్తు, ధన రూపాల్లో పేదలకు దానం చేయడాన్నే జకాత్ అంటారు. ఒక కుటుంబంలో 7.5 తులాల బంగారం, 52.5 తులాల వెండి ఆభరణాలు, తత్సమానమైన ధనం ఉంటే అందులో 2.5 శాతం విలువగల వాటిని దాన, ధర్మాలు చేయాలి.
హజ్ యాత్ర..
ఆర్థిక స్థోమత కలిగిన ముస్లీంలు విధిగా హజ్ యాత్ర చేయాలి. 40 రోజుల పాటు సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ప్రాంతాలకు వెళ్లి అక్కడ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. బక్రీదు పండుగ సమయంలో హజ్ జరుగుతుంది. అప్పు చేసి హజ్ యాత్ర చేయాల్సిన అవసరం లేదు. హజ్‌యాత్రకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు కుటుంబ పోషణకు అవసరమైన నిధులు ముందుగానే సమకూర్చుకోవాలి.
అల్లాహ్ మార్గంలో నడవాలి..
ఇస్లాం ధర్మాలు, నియమ నిబంధనలు, పాటించాల్సిన సూత్రాలు, ఆచరించాల్సిన పద్ధతులను తెలుసుకోవడం చాలా అవసరం. నేర్చుకున్న అంశాలను ఇతరులకు పంచి అందరు మంచి మార్గంలో నడిచేలా కృషి చేయాలని ఇస్లాం సూచిస్తుంది.
అవకాశాన్ని చేజార్చుకోవద్దు
అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఏడాదికి ఒక్కమారు వస్తుంది. ఈ మాసంలో ప్రతి ఒక్కరు తమ అనుకూలతను బట్టి విధిగా కొన్ని రోజులైనా రోజా ఉండి అల్లాహ్ స్మరణలో గడపాలి. అప్పుడే మనిషిలో మంచి ఆలోచనలతో సన్మార్గం వైపు పయనించగలడు. అలాగే ధనవంతులు ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. – మౌలానా అబుసయిద్, ఇమామ్, ఆయేషా మసీదు,రాజంపేట
రంజాన్ నియమాలు.. ముక్తికి మార్గాలు