మదనపల్లె సిటీ : ధర్మాని రక్షిస్తూ ఉండాలని జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి అన్నారు. మదనపల్లె మండలం చిప్పిలిలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య సహకారంతో నూతనంగా నిర్మించిన సత్యదేవ సదన్ భవన్‌ను ప్రారంభించారు. ఆలయంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ధర్మాన్ని వదిలివేస్తే లక్ష్మిదేవి నిన్ను వదిలివేస్తుందన్నారు. అయిదు గుణాలు ఉన్నవారిని లక్ష్మి వరిస్తుందన్నారు. ప్రతి నిత్యం కర్మలను ఆచరిస్తూ ఉండాలన్నారు. ఫలకాంక్ష లేని కర్మలను ఆచరించాలన్నారు. ఉదయం ఆలయంలో గోపూజ, గణపతి పూజ, వాస్తుపూజ, హోమం, వాస్తుబలి నిర్వహించారు. ఆలయం ఆవరణంలో సత్యదేవుని వ్రతం కనుల పండువగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అమరనాథ్, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి దివాకర్, కో ఆర్డినేటర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.