రాయచోటి అర్బన్ : విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పాటు దేశభక్తి, సామాజిక సేవాభావాలను పెంపొందించేందుకు బాలభటుల ఉద్యమం ( స్కౌట్ అండ్ గైడ్స్) తోడ్పడుతుందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. బుధవారం పట్టణంలోని అర్చన కళాశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. గార్డ్ ఆఫ్ హానర్‌తో స్కౌట్ విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ స్కౌట్‌అండ్ గైడ్స్ శిక్షణ పొందిన విద్యార్థులకు శారీరక దారుఢ్యంతో పాటు బంగారు భవిష్యత్తు సమకూరుతుందన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా వారు ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదిగేందుకు స్కౌట్ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నా రు. స్కౌట్‌లో చేరడం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు, మానవతా విలువలు పెంపొందుతాయని చెప్పారు. విద్యార్థి దశనుంచే తల్లిదండ్రులు, గురువులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా మెలిగేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న స్కౌట్‌మాస్టర్‌లు, గైడ్ కెప్టెన్‌లకు ఆయన సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మదన్‌మోహన్‌రెడ్డి, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, ఏఎస్‌ఓసీ లక్ష్మీకర్, హెచ్‌డబ్ల్యు నిర్మల, స్కౌట్ మాస్టర్‌లు ఓబుళరెడ్డి, నాగరాజు, గైడ్ కెప్టెన్‌లు సుజాత, గోవిందమ్మ, స్వర్ణలతతో పాటు స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు