
- హామీల అమలుకు గడువు ప్రకటించాలి
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం
- ఏపీలో హింసకు చరమగీతం పాడాలి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..
ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి.
అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్‌గా కావాలి..
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్‌గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్‌లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
