జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌

YSRCP clean sweep in GVMC standing committee elections - Sakshi

10కి 10 స్థానాలూ కైవసం

ఉన్న సభ్యులకంటే పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు

టీడీపీ కార్పొరేటర్ల ఓట్లూ వైఎస్సార్‌సీపీకే! 

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. పది స్థానాలకు గాను పదీ గెల్చుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పార్టీకి ఉన్న అభ్యర్థులకంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇలా ఇతర పార్టీల సభ్యులు కూడా వైఎస్సార్‌సీపీకి ఓటేయడం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలనకు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జీవీఎంసీలో వైఎస్సార్‌సీపీకి 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రుల మద్దతు తోడవడంతో మొత్తంగా 62 మంది ఉన్నారు. స్థాయీ సంఘానికి పోటీ చేసిన 10 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లలలో నలుగురికి 67 ఓట్లు చొప్పున పోలయ్యాయి. ఇద్దరికి 66, ముగ్గురుకి 65, ఒక కార్పొరేటర్‌కు 64 చొప్పున ఓట్లు వచ్చాయి. టీడీపీ, సీపీఐ, బీజేపీల నుంచి కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, ప్రధానంగా టీడీపీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేశారు.

జగన్‌ ప్రభుత్వానికి టీడీపీ కార్పొరేటర్ల మద్దతు : కన్నబాబు
ఈ సందర్భగా మాజీ మంత్రి, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల ఇన్‌చార్జి కురసాల కన్నబాబు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా సీఎం జగన్‌ ప్రభుత్వానికి మద్దతు పలకడం విశేషమన్నారు. విశాఖ మహానగరాన్ని పరిపాలన రాజధానిగా చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తుంటే  చంద్రబాబు అడ్డు తగులుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి సూచనలు, సలహాలతో ఈ విజయం సాధించామని చెప్పారు. అలాగే మంత్రి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నగర మేయర్, పార్టీ నగర అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్‌ లీడర్, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top