2.48 లక్షల మందికి ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’

YSR Vahanamitra for above 2 lakh people In Andhra Pradesh - Sakshi

ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.248.47 కోట్లు 

నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద మంగళవారం ఆర్థిక సహాయం అందజేయనుంది. వరుసగా మూడో ఏడాది కూడా ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుండటం విశేషం. కరోనా గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నెల రోజుల ముందుగానే  వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది 2,48,468 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా రూ.248.47 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మంగళవారం జమ చేసే నగదులో కలిపి ఇప్పటివరకు రూ.759 కోట్లను డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసినట్టవుతుంది.


అత్యధికులు బీసీలే..
ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికంగా ఉండటం విశేషం.  మొత్తం 2,48,468 మంది లబ్ధిదారుల్లో బీసీలు, ముస్లిం మైనార్టీలు కలిపి 1,38,372 మంది ఉన్నారు. ఎస్సీలు 59,692 మంది, ఎస్టీలు 9,910 మంది, ఓసీలు 40,494 మంది ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఏకంగా 83 శాతం మంది ఉండటం విశేషం. గత ఏడాది కాలంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు కొనుగోలు చేసిన, యాజమాన్య హక్కుల బదలాయింపు పొందిన 42,932 మంది కూడా ఈ సంవత్సరం కొత్తగా లబ్ధి పొందనున్నారు. అర్హత ఉండి జాబితాలో పేరులేని వారు తగిన ఆధారాలతో గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని రవాణా శాఖ తెలిపింది. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలుంటే 91542 94326 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకానికి సంబంధించి సలహాలు, ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 1902కు కాల్‌ చేయవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top