గతంలో మొక్కుబడిగా పథకాల అమలు: సీఎం జగన్‌ | Ysr Kalyanamasthu Ysr Shaadi Tohfa Funds Release Updates | Sakshi
Sakshi News home page

గతంలో మొక్కుబడిగా పథకాల అమలు: సీఎం జగన్‌

Published Thu, Nov 23 2023 10:59 AM | Last Updated on Thu, Nov 23 2023 2:40 PM

Ysr Kalyanamasthu Ysr Shaadi Tohfa Funds Release Updates - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయగలుగుతున్నాం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం. పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు అందరినీ ప్రతి సందర్భంలో నా..నా..నా అంటూ వారి మీద ఓనర్ షిప్ తీసుకుంటూ, ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు అంటూ భరోసా ఇస్తూ, చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. ఈరోజు ఈ పథకం ద్వారా జూలై నుంచి సెప్టెంబర్ దాకా జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలకు 81.64 లక్షల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.

ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించాం. 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఇవాళ్టికి ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదని బేరీజు వేసుకుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో పథకాలు తీసుకురావాలని, పేదవాళ్లకు మంచి జరగాలని అడుగులు పడలేదు. ఆ ఉద్దేశం, సంకల్పం మంచిదైతే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ పథకం.

ఈ పథకం ప్రకటించేటప్పుడు ఎందుకు పదో తరగతి సర్టిఫికెట్, 18 సంవత్సరాలు తప్పని సరి అని నాతో చాలా మంది అన్నారు. అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు. నేను ఒకటే అన్నాను. ఓట్లు అన్నది, ఎన్నికలన్నవి సెకండరీ. లీడర్లుగా ఉన్నప్పుడు సంకల్పం, విజన్ మోస్ట్ ఇంపార్టెంట్. 10వ తరగతి సర్టిఫికెట్, 18 ఏళ్లు వధువుకు, 21 ఏళ్లు వరుడికి ఉండాలని చెబుతామో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గేలా అడుగులు వేశాం. రెండోది 10వ తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుతున్నాయి. ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాయి. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీల బోధన, 3వ తరగతి నుంచి సబ్జెట్ టీచర్, 8వ తరగతి వాళ్లకు ట్యాబ్స్, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ తో పిల్లలు బాగా ఎదగాలని అడుగులు వేస్తున్నాం. 

తల్లులను మోటివేట్ చేస్తూ అమ్మ ఒడి తెచ్చాం. తమ పిల్లలను బడులకు పంపేలా మోటివేట్ అవుతున్నారు. 10వ తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువుతారు. 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి, ఇంటర్ దాకా అమ్మ ఒడి వర్తిస్తుంది కాబట్టి ఇంటర్ చదివిస్తారు. తల్లిదండ్రులకు నష్టం లేదు. అమ్మ ఒడి ద్వారా ఆదాయం వస్తుంది. ఇంటర్ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అందుబాటులో ఉన్నాయన్నది మెదడుకు తడుతుంది. పూర్తి ఫీజు అందుతుందని, పిల్లలను చదివించగలమని తడుతుంది. వసతి దీవెన కింద రూ.20 వేల వరకు సంవత్సరానికి వస్తుందన్నది తడుతుంది. పిల్లల్ని గ్రాడ్యుయేషన్ వరకు చదివించేందుకు మోటివేట్ అవుతారు. చదువులన్నది గ్రాడ్యుయేట్స్ అయ్యే దాకా పిల్లల దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇలా చదివించగలగడం వల్ల జనరేషన్ చేంజ్ వస్తుంది. చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే గొప్ప వ్యవస్థ పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ పథకం తెచ్చాం.

గత ప్రభుత్వంలో పదో తరగతి ఇన్‌సిస్ట్ చేసే పరిస్థితి లేదు. 2018కి పథకమే పక్కన పడేశారు. ఇంత మందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎప్పుడిస్తారో తెలియదు. ఎక్కడా మోటివేషన్, చిత్తశుద్ధి లేదు. ఈ రోజు మనం చిత్తశుద్ధి, మోటివేషన్, ట్రాన్స్ పరెంట్‌గా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్, మరుసటి నెల కల్యాణమస్తు, షాదీ తోఫా తల్లుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి తెచ్చాం. గతంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే.. కొంత మందికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. మనం మైనార్టీలకు ఏకంగా లక్ష రూపాయలు ఇస్తున్నాం. అది కూడా పదో తరగతి పాస్ అయ్యుండాలని చెబుతున్నాం. 

ఇలా చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులంతా పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించేలా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి పోయే కొద్దీ చాలా మందికి మోటివేషన్ దిశగా అడుగులు వేయించాలని తపన, తాపత్రయం పడుతూ అడుగులు వేస్తున్నాం. దేవుడు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇప్పుడు 10,511 జంటలకు ఇస్తున్న వారిలో 8042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయన్న విషయం చాలా సంతోషం కలిగిస్తోంది. గొప్ప మార్పుకు చిహ్నం. రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో 100 శాతం కింద రిజిస్టర్ కావాలని తపన, తాపత్రయ పడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement