చంద్రబాబు సర్కార్ రెడ్‌బుక్ పాలనను ఎత్తిచూపిన వైఎస్ జగన్
రాష్ట్రంలో చట్టబద్ధ పాలన సాగడం లేదు
పోలీసులంటేనే ప్రజలు భయపడి పోతున్నారు.. సాయికృష్ణ కస్టోడియల్ డెత్.. రహస్యంగా దహనం
వేధింపులు తట్టుకోలేపోతున్నానంటూ క్రాంతి కుమార్ ఆత్మహత్య
పోలీసుల వేధింపులతో కళావతి, తిరుపతమ్మలు బలవన్మరణం
చిత్రహింసలతో గంగమ్మ మృతి.. రహస్యంగా ఖననం ఆరోపణలు
ఈ ఘటనలతో పోలీసుల దాషీ్టకాలు సాధారణం అయిపోయాయి
కోడి కోశారు.. మేక కోశారనే చిన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకు వేధింపులు
మోరల్ పోలీసింగ్ పేరుతో కోర్టులు, జడ్జిల పాత్ర కూడా వారే పోషిస్తున్న కొందరు అధికారులు
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు
ఇవన్నీ పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి
పర్యవసానాల బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. పోలీసులు ఉన్నది రాజకీయ కక్ష సాధించే పనిముట్లుగా మారడానికి కాదు
న్యాయం కనుమరుగై భయం రాజ్యమేలితే.. చట్టం స్థానంలో అధికార దుర్వినియోగం నడిస్తే.. బలయ్యేది ప్రజాస్వామ్యమే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు తాము అత్యంత భయపడేది పోలీసులకేనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రెడ్‌బుక్ పాలన సృష్టిస్తున్న భీతావహ ఘటనలను దేశం దృష్టికి తీసుకొస్తూ శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
గాదె సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం, కనుమరుగు, రహస్యంగా దహనం.. పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో, శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వేధింపుల వల్ల ప్రాణాలు తీసుకున్న కళావతి, కర్నూలు జిల్లాలో విచారణ పేరుతో పోలీసుల చిత్రహింసల కారణంగా దళిత మహిళ గంగమ్మ మరణించిందనే ఆరోపణలు, ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరడాన్ని ఆ పోస్టులో వైఎస్ జగన్ ప్రస్తావించారు.
‘ఏపీలో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా పని చేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్‌బుక్ ప్రకారం పని చేస్తున్నారా?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దేశం దృష్టికి తీసుకొస్తూ వైఎస్ జగన్ చేసిన పోస్టు సంచలం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే..
హలో ఇండియా! చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన నడుస్తోంది
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఇప్పుడు అత్యంత భయపడేది పోలీసులకేనా? గాదె సాయికృష్ణ లాకప్ డెత్ (కస్టోడియల్ డెత్), అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు.. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు కేవలం విషాద ఘటనలు మాత్రమే కావు.
ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్‌బుక్ పాలన’ పెంచి పోషిస్తున్న ప్రమాదకర సంస్కృతికి ఫలితాలు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్‌బుక్ ప్రకారం పని చేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టపాలన స్థానంలో అధికార దుర్వినియోగం పోలీసు వ్యవస్థకు నిర్వచనంగా మారుతోంది.
ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూశామా?
రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రకటించిన నాడే వైఎస్సార్‌సీపీ ఒక హెచ్చరిక చేసింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తే.. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, వ్యవస్థలు కలుషితమవుతాయని.. రాజ్యాంగ పరిరక్షణ, చట్టాలు, నిబంధనలను మీరి, వాటికి అతీతంగా వ్యవహరించే పరిస్థితి వస్తుందని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది. ఆ హెచ్చరిక ఈ రోజు చేదు నిజంగా మారింది. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో మొదట రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా మారారు.
తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు.. ఆ తర్వాత జర్నలిస్టులు, మేధావులు లక్ష్యంగా మారారు. రాజకీయ వేధింపులతో ప్రారంభమైన ఈ ధోరణి.. ఇప్పుడు అదుపు తప్పిన పోలీసింగ్‌గా మారింది. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా పోలీసుల వేధింపులకు, బెదిరింపులకు, అధికార దుర్వినియోగానికి బాధితులుగా మారుతున్నారు. సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసింది.
తన కుమారుడి ఆచూకీ కోసం, కనీసం అతని అస్థికలైనా తనకు అప్పగించాలని ఒక తల్లి ఈ రోజు అధికారులను వేడుకుంటోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూశామా? క్రాంతికుమార్ ఘటన కూడా అంతే ఆందోళనకరం. ఆత్మహత్యకు పాల్పడే ముందు అతను పోలీసులు వేధిస్తున్నారని బహిరంగంగా ఆరోపిస్తూ, సంబంధిత అధికారుల పేర్లు కూడా ప్రస్తావించాడు.
తునిలో తిరుపతమ్మ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసిన అనంతరం ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి పోలీసుల వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ విచారణ పేరుతో జరిగిన పోలీసు చిత్రహింసల కారణంగా మరణించిందని ఆరోపణలు వచ్చాయి.
ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పుడు అవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు.. వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఒక ప్రమాదకర ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.
సీఎం, హోం మంత్రి, డీజీపీ వైఖరే కారణం
అదే సమయంలో పోలీసుల దాష్టీకాలు సాధారణం అయిపోయాయి. కోడి కోశారన్న, మేక కోశారన్న చిన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను వీధుల్లో ఊరేగించి అవమానిస్తున్నారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కొందరు అధికారులు కోర్టులు, న్యాయమూర్తులు, జడ్జిలు పాత్రలన్నీ తామే పోషిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తే వాటిని పట్టించుకోవడం లేదు. కేసులు నమోదు చేయడం లేదు. ఈ బరితెగించిన ద్వంద్వ వైఖరి, పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది.
ఈ పరిస్థితికి రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. దిగజారిన ఈ పరిస్థితుల వల్ల ఉత్పన్నమవుతున్న పర్యవసానాల బాధ్యతల నుంచి వారు తప్పించుకోలేరు. ఆంధ్రప్రదేశ్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పాలన కావాలి గానీ.. రెడ్‌బుక్ పాలన కాదు.
పోలీసులు ఉన్నది ప్రజల హక్కులను పరిరక్షించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి, న్యాయం అందించడానికే గానీ రాజకీయ కక్ష సాధించే పనిముట్లుగా మారడానికి కాదు. న్యాయం కనుమరుగై భయం రాజ్యమేలితే.. చట్టం స్థానంలో అధికార దుర్వినియోగం నడిస్తే.. చివరకు ప్రజాస్వామ్యమే బలవుతుంది’ అని పేర్కొన్నారు.


