
డీజిల్ క్యాన్‌తో కలెక్టరేట్‌కు వచ్చిన బాధిత రైతు సుధాకర్
భూ సమస్య పరిష్కరించాలంటే లంచమివ్వాలని వీఆర్వో డిమాండ్
రెవెన్యూ సదస్సుకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నా స్పందించని అధికారులు
ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో విసిగిపోయిన అన్నదాత
కలెక్టరేట్‌లో మూడుసార్లు అర్జీలిచ్చినా ఫలితం లేదు
డీజిల్ డబ్బాతో కలెక్టర్ వద్దకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
కడప కలెక్టరేట్ ఆవరణలో కలకలం
కడప (సెవెన్ రోడ్స్): భూసమస్య పరిష్కారం కోసం ఓ అన్నదాత రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. సమస్య పరిష్కరించాలంటే లంచమివ్వాలని అధికారులు డిమాండ్ చేయడంతో ప్రజాప్రతినిధులకు గోడు వెళ్లబోసుకున్నాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో భూ సమస్యల పరిష్కారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. అక్కడా పట్టించుకోకపోవడంతో మూడుసార్లు కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. న్యాయం జరక్కపోవడంతో విసిగిపోయిన రైతు కలెక్టర్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. డబ్బాలో డీజిల్ నింపుకుని సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. పోలీసులు ముందుగానే గుర్తించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కడప కలెక్టరేట్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటనకు నేపథ్యమిదీ..
వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ముడుమాల గ్రామానికి చెందిన గడిమె సుధాకర్‌కు తండ్రి ద్వారా మూడు ఎకరాల పొలం సంక్రమించింది. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి ఇచ్చిన పొలంలో రెండెకరాలను రెవెన్యూ అధికారులు రికార్డుల నుంచి తప్పించారు. ఈ విషయం తెలిసిన సుధాకర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తప్పును సరిచేసేందుకు సర్వేయర్, వీఆర్వో చెరో రూ.10 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌ని కలిసి డబ్బు ఇచ్చుకోలేనని, న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయింది.
ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదు. కాగా.. భూ సమస్యల పరిష్కారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుకు వెళ్లిన రైతు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అయినా ఎవరూ స్పందించలేదు. కలెక్టర్‌కు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మూడుసార్లు గ్రీవెన్స్ సెల్‌లో అర్జీలు సమర్పించినా ఫలితం కనిపించలేదు. దీంతో సోమవారం డీజిల్ నింపిన క్యాన్ పట్టుకుని కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. కలెక్టర్ సమక్షంలోనే వంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవాలనుకున్నాడు.
పోలీసులు అడ్డుకోవడంతో..
అయితే, గత వారం కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రైతు సుధాకర్‌ను ప్రధాన ద్వారం వద్దే నిలిపి తనిఖీ చేయగా అతడి వద్ద ప్లాస్టిక్ కవర్‌లో తెచ్చిన డీజిల్ క్యాన్ బయటపడింది. అప్రమత్తమైన పోలీసులు డీజిల్ క్యాన్‌ని లాక్కుని ఆయన్ను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న డీఆర్వో విశ్వేశ్వరనాయుడు వద్దకు రైతును తీసుకొచ్చారు. డీఆర్వో ఎదుట సుధాకర్ గోడు వెళ్లబోసుకుంటూ.. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. వారిలో ఒకరు దివ్యాంగురాలని చెప్పారు.
తన భూమిని రికార్డుల్లో నమోదు చేసేందుకు వీఆర్వో, సర్వేయర్ రూ.10 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. రాజకీయ నాయకులు మొదలు అందరి అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించకపోవడంతో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడితే సమస్య పరిష్కారమై,, తన కుటుంబమైనా బాగుపడుతుందని ఆశించి వచ్చానంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. స్పందించిన డీఆర్‌వో బి.మఠం తహసీల్దార్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు.