Vizag: అదానీ డేటా సెంటర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

VMRDA Approval For Adani Data Center Layout Plan in Visakhapatnam - Sakshi

లే–అవుట్‌ ప్లాన్‌కు వీఎంఆర్‌డీఏ అనుమతి

రానున్న ఏడేళ్లలో భారీ డేటా, ఐటీ బిజినెస్‌ పార్కుల నిర్మాణం

స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌ కూడా

రూ. 14,634 కోట్ల పెట్టుబడి... 24,990 మందికి ఉపాధి

మొత్తం 130 ఎకరాల్లో మధురవాడలో నిర్మాణం 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ సిగలో మరో దిగ్గజ సంస్థ మణిహారంగా చేరనుంది. దేశంలో అతి పెద్ద డేటాసెంటర్‌ను విశాఖ నగరంలో ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రముఖ సంస్థ అదానీ మధురవాడ సమీపంలో డేటా సెంటర్‌ పార్కుతో పాటు బిజినెస్‌ పార్కు, ఐటీ సంస్థ, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన లే అవుట్‌ ప్లాన్‌కు వీఎంఆర్‌డీఏ అనుమతులు మంజూరు చేయడంతో కీలక అడుగు పడింది. డేటా సెంటర్‌ పార్క్, ఐటీ బిజినెస్‌ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ నిర్మాణాలకు మధురవాడ సర్వే నంబర్‌ 409లో ఎకరానికి రూ.కోటి చొప్పున 130 ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది.

ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్‌ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్‌ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్‌ పార్కు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. 20 ఏళ్ల పాటు ప్రభుత్వం విద్యుత్‌ ప్రోత్సాహకాలు అందించనుంది. ఇందుకోసం సంస్థ ఏకంగా రూ.14,634 కోట్లను వెచ్చించనుంది. ఫలితంగా 24,990 మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అనుగుణంగా వైజాగ్‌ టెక్‌ పార్కు పేరుతో తనకు అనుబంధంగా 100 శాతం సబ్సిడరీ సంస్థను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌  (ఎస్‌పీవీ)ను అదానీ సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది.  


ఏడేళ్లు రూ.14,634 కోట్లు 
అదానీ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు ఐటీ పాలసీ ప్రకారం అన్ని విధాల సహకారాలు అందించేందుకు ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ(ఏపీఈఐటీఏ), కన్సల్టేటివ్‌ కమిటీ ఫర్‌ ది ఐటీ ఇండస్ట్రీతో పాటు ఏపీఐఐసీని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మొదటి మూడేళ్ల కాలంలో 30 మెగా వాట్లు (ఎంవీ) డేటా సెంటర్‌ పార్కు పూర్తి చేయాలని, నాలుగేళ్ల నాటికి 60 మెగావాట్లు, 5 ఏళ్లకు 110 మెగావాట్లు, 6 ఏళ్లకు 160 మెగావాట్లు, ఏడేళ్లకు 200 మెగావాట్లు కింద మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఏడేళ్ల కాలంలో దశలవారీగా పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం రూ.14,634 కోట్ల భారీ పెట్టుబడులతో అదానీ సంస్థ తమ ప్రాజెక్టును విశాఖలో విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం 100 శాతం సబ్సిడరీతో వైజాగ్‌ టెక్‌ పార్క్‌ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)ని 13 నవంబరు 2021న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుమార్లు ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో అభివృద్ధి పనులకు సంబంధించిన పురోగతిని పరిశీలించేందుకు అదానీ కంపెనీ ప్రతినిధులు మధురవాడలో పర్యటించారు. 


ప్రత్యక్ష, పరోక్షంగా 24,990 మందికి ఉపాధి
 
దేశంలోనే మొట్టమొదటి మెగా డేటా సెంటర్‌ ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. డేటా సెంటర్‌తో పాటు ఏర్పాటు కానున్న ఐటీ బిజినెస్‌ పార్కు, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌వల్ల రానున్న ఏడేళ్ల కాలంలో ఏకంగా 24,990 మందికి ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే కంపెనీ హామీనిచ్చింది. మొదటి మూడేళ్ల కాలంలో 30 శాతం మందికి, ఐదేళ్ల నాటికి 70 శాతం, ఏడేళ్ల కాలంలో 100 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పన పూర్తి చేయనున్నారు. 200 మెగావాట్ల డేటాసెంటర్‌ పార్కులో 1,240 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, ఐటీ బిజినెస్‌ పార్కులో 1,200 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఐటీ బిజినెస్‌ పార్కు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐటీ కంపెనీల ద్వారా 21,000 మందికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా 500 మందికి, రిక్రియేషన్‌ ద్వారా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా అదానీ సెంటర్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా మొత్తంగా 24,990 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.  

లే–అవుట్‌ అనుమతులు వచ్చాయి 
మధురవాడలో ఏర్పాటు కానున్న అదానీ డేటా సెంటర్‌లో నిర్మాణాల కోసం లే–అవుట్‌ ప్లాన్‌కు వీఎంఆర్‌డీఏ అనుమతినిచ్చింది. భూమి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు పలుసార్లు కేటాయించిన భూమిని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సెంటర్‌ ఏర్పాటు కోసం రూ. 14,634 కోట్ల పెట్టుబడులు సంస్థ పెట్టనుంది. తద్వారా 24,990 మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ హామీనిచ్చింది.  
– యతిరాజు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top