మంత్రి కుటుంబం కంపెనీ కోసం.. మా గ్రామాలు నాశనం కావాలా? | Villagers Protest Biogas Plant On Minister Family Land, Allege Threat To Livelihoods And Environment | Sakshi
Sakshi News home page

మంత్రి కుటుంబం కంపెనీ కోసం.. మా గ్రామాలు నాశనం కావాలా?

May 19 2026 5:37 AM | Updated on May 19 2026 8:55 AM

Villagers Protest Against Bio-Gas Factory in Eluru District

మంత్రి పార్థసారథి కుటుంబ సభ్యులకు కేటాయించిన భూముల్లో బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయవద్దు అంటూ నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు నిరసన

ఏలూరు జిల్లాలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ను అడ్డుకున్న నాలుగు గ్రామాల ప్రజలు  

మా పొట్టకొట్టి మంత్రి పార్థసారథి కుటుంబానికి భూములు కేటాయిస్తారా? 

చంద్రబాబు ప్రభుత్వంపై నాలుగు గ్రామాల ప్రజల ఆగ్రహం

ఆగిరిపల్లి: ‘మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యుల కంపెనీ కోసం మా గ్రామాలు నాశనం కావాలా...’ అని నాలుగు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం భూమిని చదును చేసే పనులను ఆ గ్రామాల ప్రజలు వచ్చి అడ్డుకున్నారు. దీంతో పొక్లెయిన్‌ డ్రైవర్‌ పనులు నిలిపివేసి వెళ్లిపోయాడు. మంత్రి కొలుసు పార్థసారథి కుమారుడికి చెందిన కంపెనీ నితిన్‌కృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌ పేరిట ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 2/1లో 45.60 ఎకరాల విలువైన భూమిని కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.

ఆ భూమికి చుట్టుపక్కల ఉన్న తోటపల్లి, చిన్నాగిరిపల్లి గొల్లగూడెం, సర్నాలగూడెం, సింగన్నగూడెం గ్రామాల ప్రజలు బయోగ్యాస్‌ను ప్లాంట్‌ ఏర్పాటు చేయవద్దు అంటూ ఆందోళన చేయడంతో కొన్ని రోజులుగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదు. మళ్లీ మంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం కేటాయించిన కొండ వద్ద రెండు రోజులుగా భూమిని పొక్లెయిన్‌తో చదును చేస్తుండటంతో ఆ గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు.  

మా పొట్ట కొట్టి.. మంత్రికి భూమి కట్టబెడతారా? 
ఈ సందర్భంగా నాలుగు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి తోటపల్లి పరిధిలోని కొండ ప్రాంతంలో మేకలు, గొర్రెలు, గేదెలను మేపుకొని కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తమ జీవనోపాధిని దెబ్బతీసి మంత్రి కుటుంబ సభ్యులకు ఆ భూమి కేటాయిస్తే తాము ఎలా బతకాలంటూ నిలదీశారు. బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే వచ్చే విషవాయువులు, వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాలు నాశనమైపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ భూముల్లో పర్యావరణానికి హాని కలుగజేసే గ్రావెల్‌ తవ్వకాలు, కంపెనీలు ఏర్పాటు చేయకూడదని హైకోర్టు 2022లోనే తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా మంత్రి కుటుంబ సభ్యులకు భూమిని ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. అక్రమంగా కొండను తవ్వేసి ఎంతో విలువైన గ్రావెల్‌ను తరలించి కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయని నాలుగు గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ఇక్కడి కొండను బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం తవ్వేస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. బయోగ్యాస్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని చూస్తే ఎంతవరకు పోరాడడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement