బెజవాడ బాస్ భారీ డీల్! | Vijayawada Police Boss Settlement Style in Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బెజవాడ బాస్ భారీ డీల్!

Jun 30 2026 4:54 AM | Updated on Jun 30 2026 9:53 AM

Vijayawada Police Boss Settlement Style in Chandrababu Govt

ఆ పోలీసు బాస్‌ రూటే సెప‘రేటు’

అద్వైక ట్రేడింగ్‌ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్‌

1,500 మంది ఖాతాదారులకు టోపీ

రూ.300 కోట్లకు పైగా అక్రమ డిపాజిట్లు

ఘరానా మోసానికి పోలీస్‌ బాస్‌ అభయహస్తం

ఒక్క ఫిర్యాదు, రూ.53 లక్షల మోసానికే కేసు పరిమితం.. సీఐడీ, ఈడీ కళ్లు గప్పి దందా

ప్రత్యేక బ్యాంకు ఖాతాలో డీల్‌ మొత్తం జమ

ఇదీ విజయవాడ పోలీస్‌ బాస్‌ సెటిల్మెంట్‌ స్టైల్‌

సాక్షి, అమరావతి: విజయవాడ పోలీస్‌ బాస్‌ రూటే సెప‘రేటు’. కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌ లాకప్‌లోనే మాయం చేసిన దారుణం రాష్ట్రాన్నే నివ్వెరపరచగా.. మరోవైపు పోలీసు బాస్‌ అక్రమాలు మరింతగా బట్టబయలవు­తున్నాయి. రూ.300 కోట్ల అక్రమ డిపా­జిట్లతో ఖాతాదారులను బురిడీ కొట్టించిన ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థకు అనుకూలంగా ఆయన కథ నడిపించిన తీరు అధికారిక వైట్‌ కాలర్‌ నేరాన్ని తలపిస్తోంది. సీఐడీ, ఈడీల కళ్లు గప్పేందుకు ఆ కేసును నీరుగార్చిన తీరు.., ఆ సంస్థ మేనేజ్‌మెంట్‌తో భారీ డీల్‌ కుదుర్చుకున్న వైనం విస్మయపరుస్తోంది. ప్రభుత్వ పెద్దలు రెడ్‌బుక్‌ కుట్రల కేసులను దర్యాప్తు చేస్తున్న సమయంలోనే విజయవాడ కేంద్రంగా భారీ దందాలకు పాల్పడాలన్నది ఆయన ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ డీల్‌ కథా కమామిషు ఇదిగో ఇదీ..

రూ.300 కోట్ల అక్రమ డిపాజిట్ల దందా
అద్వైక ట్రేడింగ్‌ కంపెనీ విజయవాడ కేంద్రంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘిస్తూ,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కనీసం రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోకుండా ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి దాదాపు 1,500 మంది ఖాతాదారుల నుంచి రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసి, వారిని బురిడీ కొట్టించింది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 70 మందికి పైగా ఏజంట్లను నియమించుకుని డిపాజిట్లు సేకరించింది. అనంతరం వడ్డీలు చెల్లించడం నిలిపివేసింది. దీనిపై ఖాతాదారులు ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసింది. ఓ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో కంపెనీపై గత ఏడాది జూన్‌లో కేసు నమోదు చేశారు. 

మోసపోయిన ఖాతాదారులు దాదాపు 1,500 మంది విజయవాడ పోలీసులకు గోడు వెళ్లబోసుకున్నారు. డిపాజిట్‌ పత్రాలు, ఇతర ఆధారాలు సమర్పించారు. దాంతో ఈ కేసుపై విజయవాడ పోలీసులు సమగ్ర దర్యాప్తు  చేసి డిపాజిటర్లకు న్యాయం చేస్తారని అంతా భావించారు. అదే సమయంలో పోలీస్‌ బాస్‌ రంగంలోకి దిగారు. అద్వైక ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్య ప్రతినిధులను పిలిపించారు. కేసు సమగ్రంగా విచారిస్తే అక్రమ డిపాజిట్లు మొత్తం వెనక్కి ఇవ్వాల్సి రావడంతోపాటు.. తీవ్ర శిక్ష పడుతుందని తనదైన శైలిలో బెదిరించారు. తన డీల్‌ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అందుకు యాజమాన్య ప్రతినిధులు సమ్మతించినట్టు సమాచారం. దాంతో పోలీస్‌ బాస్‌ చకచకా పావులు కదిపారు.

రూ.300 కోట్ల మోసం.. రూ.53 లక్షల కేసు
1,500 మంది నుంచి రూ.300 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన ఈ ఆర్థిక మోసం కేసును నిబంధనల ప్రకారం సీఐడీ దర్యాప్తు చేయాలి. మార్గదర్శి చిట్‌ఫండ్స్, అగ్రిగోల్డ్‌ కేసులను సీఐడీనే విచారించింది. కేసు వివరాలను, ఎఫ్‌ఐఆర్‌ కాపీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి నివేదించాలి. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. కానీ ఈ కేసును సీఐడీ పరిధిలోకి, ఈడీ దృష్టికి వెళ్లకుండా పోలీస్‌ బాస్‌ కనికట్టు చేశారు. అందుకే ఒక్క ఖాతాదారుడు ఇచ్చిన ఫిర్యాదుకే పరిమితమై.. ఈ కేసును కేవలం రూ.53 లక్షల మోసానికే పరిమితం చేశారు. మిగిలిన 1,500 మంది  ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇలా ఈ కేసు విజయవాడ పోలీసుల పరిధి దాటిపోకుండా అడ్డుకట్ట వేశారు. బాసే కేసును గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇందుకోసం ఆ కంపెనీ మేనేజ్‌మెంట్‌­తో భారీ డీల్‌ కుదుర్చుకుని కేసును మసిపూసి మారేడు కాయ చేసేశారు. 

ప్రైవేటు బ్యాంకు ఖాతాకు మళ్లింపు
టాస్క్‌ఫోర్స్‌ విభాగంలోని తనకు అనుకూలమైన అధికారులతో కలిసి పోలీస్‌ బాస్‌ ఈ దందాలో రెండో అంకానికి తెరతీశారు. అద్వైక ట్రేడింగ్‌ కంపెనీ 70 మంది ఏజంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించగా, కేసును 9 మందికే పరిమితం చేశారు.  కేవలం ఒక్క మేనేజర్‌ను నిందితుడిగా చేర్చారు. అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన కంపెనీ యాజమాన్యాన్ని కేసు నుంచి తప్పించేశారు. ఈ వ్యవహారంలో పెద్ద భాగాన్నే డీల్‌ మొత్తంగా ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఆ మొత్తాన్ని కూడా చట్టం కళ్లుగప్పి తమ ఖాతాలో పడేట్టు చేసుకున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఖాతా తెరిచి, అందులోకి డీల్‌ మొత్తాన్ని దశలవారీగా డిపాజిట్‌ చేయించినట్టు తెలుస్తోంది. దీనిని టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ఇద్దరు అధికారులు పర్యవేక్షించినట్ల సమాచారం. మోసపోయిన డిపాజిట్‌దారుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా అద్వైక ట్రేడింగ్‌ కంపెనీతో డీల్‌ కుదుర్చుకుని కేసును నీరుగార్చిన తీరు విస్మయపరుస్తోందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement