Vasapa Biryani: బిర్యానీలందు వసప బిర్యానీ వేరయా..! 

Vasapa Biryani Famous In Srikakulam District - Sakshi

వసప.. దాదాపు వెయ్యి జనాభా ఉన్న ఊరు. కానీ నిత్యం ఓ ఐదారొందల మంది అయినా ఆ ఊరి గడప తొక్కుతారు. చేతిలో పొట్లాలు, ముఖంపై నవ్వుతో బయటకు వెళ్తారు. వన భోజనాల సీజన్‌ అయితే చెప్పనక్కర్లేదు.. పసందైన సువాసనతో వసప దారిన వెళ్తున్న వారిని కూడా తన వైపు లాగేస్తుంటుంది. ఆ ఊరి బిర్యానీ మహత్యమది. చిన్న ఊరు, అంతకంటే చిన్న హొటళ్లు.. కానీ రుచి మాత్రం అమోఘం. పదిహేనేళ్లుగా అక్కడి చికెన్‌ బిర్యానీ అటు ఒడిశా, ఇటు ఆంధ్రా వాసులను తన దాసులుగా చేసుకుంది. ఎన్ని కొత్త రెస్టారెంట్లు పెట్టినా దీన్ని కొట్టే బిర్యానీ లేదంటే అతిశయోక్తి కాదు.   

కొత్తూరు: పేపర్‌పై విస్తరాకు.. అందులో ఆ మాత్రం బిర్యానీ.. మధ్యలో తళుక్కుమనే చికెన్‌ పీసులు.. వసప బిర్యానీ అని చెప్పే స్టాండర్డు గుర్తులవి. వాసన అదనం. రూ.120 పెడితే చేతిలోకి వచ్చేసే ఈ బిర్యానీకి ఎందుకంత ప్రత్యేకత అంటే సమాధానం కోసం వంశధార తీరంలో ఉన్న వసపకు వెళ్లా ల్సిందే. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓ కుగ్రామం వసప. రెండు దశాబ్దాల కిందట వలసలు అధికంగా ఉన్న రోజుల్లో ఈ ఊరు నుంచి కూడా కొందరు హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ దమ్‌ బిర్యానీ తయారీ నేర్చుకున్నారు. గ్రామానికి చెందిన కొయిలాపు వెంకటరావు కూడా అందులో ఉన్నారు. 

అప్పట్లో దమ్‌ బిర్యానీ అంటే పల్లె వాసులకు పరిచయం లేని పేరే. పెళ్లి భోజనాల్లో తప్పితే హొటల్‌కు వెళ్లి బిర్యానీ తినే రోజులు కావవి. కానీ ఆ సమయంలోనే వెంకట రావు స్వగ్రామంలో దమ్‌ బిర్యానీ చేసి స్థానికులకు రుచి చూపించారు. రుచి చూసి మె చ్చుకోని వారు లేరు. అలా మొదలైన ప్రస్థానం పదిహేనేళ్లుగా రుచికరంగా కొనసాగుతోంది. కొత్తూరు, భామిని, సీతంపేట, మండలంతో పాటు హిరమండలం, పాతపట్నం, పాలకొండ, ఆమదావలస, శ్రీకాకుళం, సారవకోట, ఎల్‌ఎన్‌పేట ఒడిశాలోని కాశీనగర్, పర్లాఖిమి డి, గుణుపూర్, హడ్డుబంగి నుంచి కూడా జనాలు ఈ బిర్యానీ కోసం ఇక్కడకు వస్తుంటారు.  

ఐదారొందల గడప ఉండే గ్రామానికి ప్రతి నిత్యం ప్రత్యేక వాహనాలతో వందలాది మంది వస్తుంటారు. వన భోజనాల సమయంలో అయితే ఈ బిర్యానీకి మరింత గిరాకీ ఉంటుంది. వివాహాలు, శుభ కార్యాలకు ఎంత మందికైనా వీరు వండి పెడతారు. వెంకటరావు తయారు చేసే బిర్యానీకి మంచి పేరు రావడంతో మరికొందరు కూడా గ్రామంలో బిర్యానీ సెంటర్లు ప్రారంభించారు. ఇక్కడా రుచి బాగుండడంతో అన్ని చోట్లా మంచి వ్యాపారం జరుగుతోంది.  

నాణ్యతే ప్రధానం.. 
అన్ని చోట్లా బిర్యానీ తయారీకి వాడే సామగ్రినే వీరూ వాడతారు. తయారు చేసే పద్ధతి కూడా ఒకటే. కానీ ఇక్కడి వంట మాస్టర్ల హస్తవాసి బిర్యానీకి మంచి రుచిని అందిస్తోంది. నాణ్యమైన మసాలా దినుసులు, బాస్మతి బియ్యం తాజాగా ఉన్న మాంసం కొనుగోలు చేసి వెంటనే వంట చేయడం వల్ల బిర్యానీ రుచికరంగా ఉంటుందని వ్యాపారులు వెంకటరావు, రామస్వామి, రాంబాబు, సంగమ స్వామిలు తెలిపారు. కార్పొరేట్‌ హొటల్స్‌కు మించిన రుచి దీని సొంతమైనా ఒక పార్సిల్‌ ధర మాత్రం ఇప్పటికీ రూ.120. 

రుచి అమోఘం  
వసప బిర్యానీ మిగిలిన చోట్ల చేసిన బిర్యానీ కంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇక్కడి బిర్యానీ తింటున్నాను. పెద్ద పెద్ద హొటళ్ల కంటే ఇక్కడే బాగుంటుంది. ధర కూడా తక్కువ. 
– పిన్నింటి ప్రసాదరావు కుంటిభద్ర, కొత్తూరు మండలం 

ఒడిశా నుంచి వచ్చాం  
వసప బిర్యానీ బాగుందని తెలియడంతో ఒడిశాలోని కాశీనగర్‌ నుంచి వచ్చి ఇక్కడి బిర్యానీ టేస్టు చేశాం. చాలా రుచిరకంగా ఉంది. 
– ఇస్మాయిల్, మెగా లిఫ్ట్‌ ఇంజినీర్, కాశీనగర్‌ ఒడిశా 

పాతిక కిలోమీటర్ల నుంచి..
వసప బిర్యానీ తినడానికి పాతపట్నం నుంచి 25 కిలోమీటర్లు  ప్రయాణించి వచ్చా. వసప బిర్యాని అనగానే నోరు ఊరిపోతుంది. తింటేనే తృప్తిగా ఉంటుంది.        
– తడక సోమేశ్వరరావు,పాతపట్నం టౌన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top