8 నెలల కంపెనీకి పప్పు బెల్లాలకు భూమి! | Valuable Land Allotted to Graydon Energy in Naidupeta | Sakshi
Sakshi News home page

8 నెలల కంపెనీకి పప్పు బెల్లాలకు భూమి!

May 18 2026 5:46 AM | Updated on May 18 2026 5:46 AM

Valuable Land Allotted to Graydon Energy in Naidupeta

గ్రైడన్‌ ఎనర్జీకి రూ.238 కోట్ల విలువైన భూమి కేవలం 4.76 కోట్లకే కేటాయింపు 

పెట్టిన పెట్టుబడిలో 69.22 శాతం రాయితీల రూపంలో తిరిగి వెనక్కు 

ఓర్వకల్లులో 3 గిగావాట్ల సోలార్‌సెల్‌ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ 

రెండు నెలల కిందట కంపెనీ పెట్టి భూమి కొట్టేసిన గ్రీన్‌మెట్‌లో బెల్జియం కంపెనీ చేరిక 

భాగస్వామి కంపెనీగా ఎన్‌ఏఎన్‌ సిలాక్స్‌ గ్రీన్‌మెట్‌ చేరికకు ఆమోదం 

నాయుడుపేటలో రూ.కోట్లు పలికే భూమి ఎకరం రూ.30 లక్షలకే..

సాక్షి, అమరావతి: కంపెనీ పెట్టు – భూమి పట్టు.. జాబితాలోకి తాజాగా గ్రైడన్‌ ఎనర్జీ, ఎన్‌ఏఎన్‌ గ్రీన్‌మెట్‌లు వచ్చి చేరాయి. ఇప్పటికే ఉర్సా, ఇండిచిప్, స్కై స్టోరేజ్, జిన్‌ఫ్రా వంటి కంపెనీలు.. ఇలా కంపెనీ పెట్టగానే అలా మంత్రివర్గం సమావేశంలో భూ కేటాయింపులు చేయడం తెలిసిందే. తాజాగా గ్రైడన్‌ ఎనర్జీకి రూ.238 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.4.76 కోట్లకే కేటాయించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.3,149 కోట్లతో 3 గిగావాట్ల సోలార్‌ సెల్‌ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎకరం రూ.10 లక్షలు చొప్పున 47.65 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్లు ఇండ్రస్టియల్‌ మెగా హబ్‌లో ఎకరం భూమి దాదాపు రూ.5 కోట్లపైనే పలుకుతోంది.

ఇంతటి విలువైన భూమిని ఉత్తరప్రదేశ్‌ నోయిడా కేంద్రంగా 2025 ఆగస్టులో ఏర్పాటైన గ్రైడన్‌కు కారు చౌకగా కేటాయించేసింది. అంతేకాకుండా పెట్టిన పెట్టుబడిలో వివిధ రాయితీల రూపంలో 69.22 శాతం తిరిగి వెనక్కు ఇవ్వనుంది. రూ.1.07 కోట్ల స్టాంప్‌ డ్యూటీ, క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ కింద రూ.920.35 కోట్లు, రూ.261 కోట్ల విలువైన విద్యుత్‌ రాయితీ, రూ.261 కోట్ల విలువైన విద్యుత్‌ డ్యూటీ మినహాయింపు, రూ.150.88 కోట్ల విలువైన సబ్సిడీతో నీటి సరఫరా.. ఇలా టైలర్‌మేడ్‌ భారీ ప్రోత్సాహకాలను ఇచ్చింది. కానీ ఈ పెట్టుబడి వల్ల లభించే ఉద్యోగాలు 320 మాత్రమే. ఇలాగే రెండు నెలల క్రితం ఏర్పాటైన ఎన్‌ఏఎన్‌ గ్రీన్‌మెట్‌కు కూడా భారీ ప్రోత్సాహకాలను ఇచ్చింది.

2025 నవంబర్‌ 10న ఏర్పాటైన ఈ కంపెనీకి 2026 ఫిబ్రవరిలో కారు చౌకగా భూములు కేటాయించగా, ఇప్పుడు అదే ప్రాజెక్టులోకి బెల్జియంకు చెందిన సిలాక్స్‌ వచ్చి చేరింది. భాగస్వామ్య కంపెనీగా చేరిన ఎన్‌ఏఎన్‌ సిలాక్స్‌ గ్రీన్‌మెట్‌కు కూడా అదే ప్రోత్సాహకాలు వర్తిస్తాయంటూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నాయుడుపేటలో రూ.కోట్లు పలుకుతున్న భూమిని ఎకరం రూ.30 లక్షల చొప్పున 21.36 ఎకరాలు కేటాయించడమే కాకుండా, రూ.1,366 కోట్ల పెట్టుబడిలో 60.38 శాతం రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. ఇక్కడ లియాన్‌ బ్యాటరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 340 మందికి ఉపాధి కల్పించనుంది.

పలు కంపెనీలకు ప్రోత్సాహకాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌తో పాటు స్నేహ ఫామ్స్, అపోలో టైర్స్, చెట్టినాడ్‌ సిమెంట్స్, ఎథరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ గిల్డ్‌ , స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌లకు కూడా రాయితీలను అందిస్తూ ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. తిరుపతి జిల్లా సత్యేవేడు మండలం వనలేరు, రాళ్లకుప్పం గ్రామాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు ఎకరం రూ.7 లక్షల చొప్పున 51.3 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ రూ.2,508 కోట్లతో 3,000 మందికి ఉపాధి కల్పించేలా యూనిట్‌ ఏర్పాటు చేయనుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పెట్టుబడిపై రూ.992 కోట్ల విలువైన పలు రాయితీలను ప్రకటించింది. స్కైరూట్‌ ఎయిరో స్పేస్‌కు తిరుపతి జిల్లా బీఎస్‌పురం, కొట్టపాలెం గ్రామాల్లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 294.67 ఎకరాలను కేటాయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement