ఇన్నాళ్లూ వంటకు ప్రత్యామ్నాయ సాధనంగానే ఇండక్షన్ స్టవ్‌ల వాడకం
ఇప్పుడు గ్యాస్ కొరతతో అవి కూడా సమాంతరంగా వినియోగం
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 50 శాతం పెరిగిన అమ్మకాలు
పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది ఇళ్లలో కనీసం మూడు ఇళ్లలో ఇండక్షన్ స్టవ్‌లు
గ్రామీణ ప్రాంతాల్లోనూ 15 శాతం వంట గదుల్లో గ్యాస్‌కు బదులుగా వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్యాస్ కొరత, దాని ధరల పెరుగుదల కారణంగా వంట విధానంలో పెనుమార్పు కనిపిస్తోంది. ఇంతకాలం గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉపయోగించిన ఇండక్షన్ స్టవ్‌లు ఇప్పుడు గ్యాస్‌తో సమానంగా వంటగదిలో స్థానం సంపాదిస్తున్నాయి. దీంతో ‘హైబ్రిడ్ వంట’ (గ్యాస్, ఇండక్షన్) అనే కొత్త ధోరణి వేగంగా విస్తరిస్తోంది.
ప్రస్తుతం గృహాల్లో వాడే గ్యాస్ సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్‌లో రూ.2 వేలు దాటడంతో పాటు, సాధారణ సరఫరాకు 10 రోజులపైనే పడుతోంది. దీంతో ప్రజలు వంటకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనం ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లుతున్నారు. ఫలితంగా వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది.
ప్రధాన నగరాల్లో పెరిగిన అమ్మకాలు..
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఇండక్షన్ స్టవ్ అమ్మకాలు 50 శాతం వరకు పెరిగాయని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు పట్టణాల్లో ప్రతి 10 ఇళ్లకుగాను కనీసం మూడు ఇళ్లల్లో ఇండక్షన్ స్టవ్ ఉందంటే ఆతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 15 శాతం ఇళ్లల్లో ఈ స్టవ్‌ల వినియోగం ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో వీటికి డిమాండ్ పెరగడంతో ఇప్పుడివి చాలాచోట్ల అందుబాటులో ఉండటంలేదు.
ఈ–కామర్స్ సైట్లలోనూ నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ప్రజలు ఎక్కడ ఇండక్షన్ స్టవ్ దొరుకుతుందంటే అక్కడికి వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితులతో ఇకపై చాలా ఇళ్లల్లో గ్యాస్‌తో పాటు సమానంగా ఇండక్షన్ స్టవ్‌ని కూడా ఉపయోగించడం (హైబ్రీడ్ వంట) సాధారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఖర్చు తక్కువే, కానీ..
ఇండక్షన్ స్టవ్ సాధారణంగా 1.5 నుంచి 2 కిలోవాట్ల విద్యుత్ వినియోగిస్తుంది. రోజుకు రెండు గంటలు వాడితే మూడు యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే.. నెలకు సుమారు 90 యూనిట్లు. ఈ లెక్కన రూ.500–600 వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే, ఇది గ్యాస్ ఖర్చుతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. వంట కూడా త్వరగా అవుతుంది. పైగా గ్యాస్‌తో పోలిస్తే సురక్షితం.
ఇబ్బందులూ ఉన్నాయి..
అయితే, ఈ ఇండక్షన్ స్టవ్‌లవల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి. అవి..
» కరెంట్ లేకపోతే పనిచేయదు..
» ప్రత్యేక పాత్రలు అవసరం. వీటికోసం రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతుంది..
» గ్రామాల్లో వోల్టేజ్ సమస్యవల్ల ఇండక్షన్ స్టవ్‌లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది..
» అదీగాక.. ఇవి చిన్న కుటుంబాలకు సరిపోవచ్చుగానీ పెద్ద కుటుంబాల్లో వీటితో కష్టం..
» అయినా గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్ ధరలతో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపిస్తోంది.
మొత్తం మీద గ్యాస్ కొరతతో ప్రారంభమైన ఈ మార్పు ఇప్పుడు సాధారణ జీవనశైలిగా మారుతోంది. దీనివల్ల పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది.


