వేసవిలో వర్షాలు.. బాబోయ్‌ దంచికొట్టేస్తున్నాయ్‌.. | Unseasonal Rains Lash Andhra Pradesh telangana | Sakshi
Sakshi News home page

వేసవిలో వర్షాలు.. బాబోయ్‌ దంచికొట్టేస్తున్నాయ్‌..

Mar 31 2026 8:29 AM | Updated on Mar 31 2026 9:07 AM

 Unseasonal Rains Lash Andhra Pradesh telangana

హైదరాబాద్‌: వేసవికాలంలో వర్షాలు దంచికొడుతున్నాయ్‌. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రైతులు నష్టపోయారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో  వానలు పడతాయని తెలిపారు. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, క‍ర్నూలు, నంద్యాలలో వర్షాలు కురుస్తాయని అన్నారు.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. గత అర్ధరాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి, చింత, వరి పంటలు నేలరాలాయి. అకాల వర్షానికి రైతులు పంటలు నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉదయం పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.



కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం (మార్చి 31) ఉదయం తెల్లవారుజామున గంటపాటు భారీ వర్షం పడింది. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే,  పలుచోట్ల విద్యుత్  స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో నిన్న రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. కాయ నేల రాలడంతో ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస‍్తున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతులకు నష్ట పరిహారమందించాలని కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న పంటలను కూడా దెబ్బతీసింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, దొంకేశ్వర్ మాక్లూర్ ఆలూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేలరాలిపోగా, కలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement