బలవంతపు భూసేకరణ చేస్తే.. కలెక్టరేట్‌లో ఉరి వేసుకుంటాం | Undavalli Farmers Oppose Forced Land Pooling for Amaravati Capital Region: AP | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణ చేస్తే.. కలెక్టరేట్‌లో ఉరి వేసుకుంటాం

May 19 2026 6:05 AM | Updated on May 19 2026 6:07 AM

Undavalli Farmers Oppose Forced Land Pooling for Amaravati Capital Region: AP

రాజధాని భూసేకరణ జాబితా నుంచి ఉండవల్లిని తొలగించాలి 

కలెక్టరేట్‌కి తరలివచ్చిన ఆ గ్రామ రైతులు 

గుంటూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం  

సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, కొండవీటి వాగు అభివృద్ధి పనుల కోసం భూములిచ్చాం 

మిగిలిన భూమి కూడా కావాలంటే ఇవ్వలేం

సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్‌: బలవంతంగా తమ భూములు లాక్కుంటే  కలెక్టరేట్‌లోని చెట్టుకు ఉరి వేసుకుంటామని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి రైతు­లు హెచ్చరించారు. రాజధాని భూసేకరణ నుంచి ఉండవల్లి గ్రామాన్ని తొలగించాలని కోరుతూ పెద్దఎత్తున రైతులు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ వారికి హామీ ఇచ్చారు. అనంతరం రాయపూడిలోని సీఆర్‌డీఏ కమిషనర్‌ విజయరామరాజుకూ రైతులు వినతిపత్రం ఇచ్చారు.

తాము రాజధానికి వ్యతిరేకం కాదని, మా తాత ముత్తాతల నుంచి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను కాపాడుకోవడం కోసం భూ సమీకరణ, భూసేకరణలకు వ్యతిరేకంగా 12 ఏళ్లుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రయోజనార్థం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి, కొండవీటి వాగు అభివృద్ధి పనులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామన్నారు. అమరావతి రాజధానికి కావాల్సినంత భూమి సీఆర్‌డీఏ వద్ద ఉందని, అందులో నిర్మాణాలు పూర్తిచేసుకోవాలని రైతులు సూచించారు.

మాకున్న కొద్దిపాటి భూమిని కుటుంబ సభ్యులు పంచుకుంటే వచ్చే వాటా చాలా తక్కువగా ఉంటుందని, ఈ భూమిని సీఆర్‌డీఏకి ఇస్తే వారు తిరిగి ఇచ్చే ప్లాట్ల పరిమాణం ఏమాత్రం సరిపోదని.. అందుకే భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టంచేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమని తేల్చిచెప్పారు. తాము 12 ఏళ్లుగా భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కక్షగట్టి భూసేకరణకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే 280 మందికి నోటీసులు ఇచ్చారని, ఊరు పేరులేని పత్రికల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి రైతులకు సమాచారం తెలీకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

మార్టీపై ఎందుకీ కక్ష?
మేం చిన్న సన్నకారు రైతులం. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు కోసం ఇప్పటికే భూములిచ్చాం. ఇప్పుడు మళ్లీ భూసేకరణ అంటూ బెదిరిస్తున్నారు. ఉన్న ఎకరాన్ని కూడా ఇవ్వాలంటున్నారు. మాకు వ్యవసాయం తప్పితే మరో పని తెలీదు. ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తుందనుకోలేదు. ఏం జరిగినా మేం భూములిచ్చే ప్రసక్తే లేదు. – టి. సంజీవరెడ్డి, ఉండవల్లి

రైతులకు ప్రభుత్వం ఏమేలు చేసిందో చెప్పండి  
మా భూమిని అన్నం పెట్టే తల్లి­లా భావిస్తున్నాం. దీనిని లా­క్కు­ంటామంటే ఎలా? ఈ రెండేళ్లలో రైతులకు కూటమి ప్ర­భు­త్వం ఏం మేలు చేసిందో చెప్ప­ండి? పైగా ఇప్పుడొచ్చి భూములపై పడుతున్నారు. నాకు కేవలం అర ఎకరా పొలమే ఉంది. దీనిని న­మ్ముకుని జీవిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేదిలేదు. – జి. బుసిరెడ్డి, ఉండవల్లి

రిజిస్ట్రేషన్లు చేయడంలేదు.. 
మా భూములకు రిజిస్ట్రేషన్లు కూ­డా చేయడంలేదు. ల్యాండ్‌ పూలి­ంగ్‌కు భూమి ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వం రైతు­­లను బెదిరిస్తోంది. పిల్లల చదువుల కోసం భూమి పత్రాలు పెట్టి అప్పు తీసుకుందా­మన్నా అవకాశంలేకుండా చేస్తున్నారు. ప్లాట్‌ ఇచ్చేదెప్పుడు? అది అమ్ముడుపోయేదెప్పుడు? అప్పటి వరకూ మేం పిల్లల చదువును ఏం చేయాలి. – ప్రభాకర్, ఉండవల్లి

అధికారంలోని వారు ఏం త్యాగం చేస్తున్నారు? 
అభివృద్ధిని అడ్డుకోవడం రైతుల అభిమతం కాదు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు కోసం ఇప్పటికే అర ఎకరం భూమిచ్చా. మిగిలి ఉన్న కొద్దిపాటి భూమినీ ఇప్పుడు ఇచ్చేయమంటున్నారు. అధికారంలో ఉన్న వారు అమరావతి రాజధాని కోసం ఏమాత్రం త్యాగం చేస్తున్నారో చెప్పాలి. – పి. పోతిరెడ్డి, ఉండవల్లి

ప్రభుత్వం విధానం మార్చుకోవాలి.. 
కులమతాలకు, పార్టీలకతీతంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అర్ధంచేసుకోవాలి. ల్యాండ్‌ పూలింగ్, ల్యాండ్‌ అక్విజేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇప్పటికే కొండవీటి వాగు కోసం భూమి ఇచ్చాం. రైతులను బెదిరించే ధోరణికి స్వస్తి పలకాలి. – ఎం. శ్రీనివాసరెడ్డి, ఉండవల్లి 

Advertisement
 
Advertisement
Advertisement